
వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. గతేడాది జనవరిలో షూటింగ్ మొదలైంది. ఇప్పటికే 80 శాతం పూర్తి అయింది.
గతంలో రాజమౌళి ఒక్కో సినిమాకి రెండేళ్లు షూటింగ్ కి టైం కేటాయించేవారు. ఈ సినిమా విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు. ఆయన లెక్కలు అన్నీ (బడ్జెట్, తీయాల్సిన రోజులు, విడుదల చెయ్యాల్సిన డేట్, వచ్చే ఆదాయం) వేసుకొని మరీ సినిమా మొదలు పెట్టారు. ఐతే, రాజమౌళి షూటింగ్ సగంలో మార్కెట్ మారిపోయింది. ఓటిటి మార్కెట్ నుంచి ఆదాయం భారతీయ సినిమాలన్నిటికీ తగ్గిపోయింది.
దాంతో, ఈ సినిమాకి 500 కోట్ల వరకు వస్తుంది అనుకున్న ఓటిటి ఆదాయం లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాకి 300 కోట్లు వస్తే అదే పెద్ద రికార్డు అవుతుంది. అంటే ముందే అంచనా వేసుకున్న ఆదాయపు లెక్కల్లో 250 కోట్ల వరకు కోత పడేలా ఉంది.
మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి దాదాపు 800 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనే లెక్కలతో రాజమౌళి సినిమా మొదలుపెట్టారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయ్యాకే ఎంత బడ్జెట్ అయింది అనేది తెలుస్తుంది. ఐతే, ముందు అనుకున్న బడ్జెట్ కి మించి ఖర్చు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఓటిటి మార్కెట్ పడిపోవడం కారణంగా.
ఐతే రాజమౌళికున్న బ్రాండ్ నేమ్, ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా విడుదల టైంకి విపరీతమైన హైప్ వస్తుంది. ఓపెనింగ్స్ కళ్ళు చెదిరి పోతాయి. సినిమాకి మంచి టాక్ వచ్చి థియేటర్లో నిలబడితే గ్లోబల్ బాక్సాఫీస్ ఆదాయమే 2000 కోట్లపైనే ఉంటుంది. సో, ఓటిటి డీల్ ఇంకా ఫైనల్ కాకపోయినా రాజమౌళి బెదిరిపోరని చెప్పొచ్చు.
