సూసైడ్ చేసుకోవాలనుకున్న నందిని

Nandini

సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మరోసారి డిప్రెషన్ అంశం తెరపైకొచ్చింది. చాలామంది నటీనటులు తమకు ఎదురైన ఒత్తిడి గురించి చెప్పడం ప్రారంభించారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ నందినీరాయ్ కూడా తను గడిపిన చీకటి రోజుల గురించి తలుచుకుంది.

“ఎన్నో ఆశలతో వచ్చాను. దానికి తగ్గట్టే పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. కానీ కొన్ని ఆగిపోయాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ (2015లో వచ్చిన సుధీర్ బాబు సినిమా) మూపీ ఫ్లాప్ అవ్వడంతో పూర్తిగా డిప్రెషన్ లో కూరుకుపోయాను.”

ఆ డిప్రెషన్ లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానంటోంది నందినీరాయ్. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని, కానీ మనోధైర్యం, డాక్టర్ల సలహాలతో బయటపడ్డానని చెబుతోంది.
“చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. టెర్రస్ పైనుంచి దూకి చనిపోవాలని అనుకున్నాను. కొన్నిసార్లు మణికట్టు కోసుకొని చనిపోవాలనుకున్నాను. నా లైఫ్, కెరీర్, కొన్ని వ్యక్తిగత సమస్యల గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ నేను వాటన్నింటితో పోరాడాలని నిర్ణయించుకున్నాను. ఫైనల్ గా విజేతగా నిలిచాను.”

డిప్రెషన్ ను తగ్గించుకునేందుకు ప్రస్తుతం ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుతున్నానని, తల్లిదండ్రులతో ఎక్కువగా మాట్లాడుతున్నానని, కిక్ బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది నందినీరాయ్.

సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతోంది ఈ ముద్దుగుమ్మ. లండన్ లో ఎంబీఏ చేసిన నందినీరాయ్ ప్రస్తుతం షేర్ మార్కెట్ గురించి తెలుసునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిపింది

Related Stories