
జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ ని చూసేందుకు అభిమానులు ఎగబడతారు అనేది అందరికి తెలిసిందే. ఆయనకి దగ్గరికి వెళ్లి కరచాలనం చెయ్యటానికి, ఫోటోలు దిగడానికి వారు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ఐతే, అభిమానుల అత్యుత్సాహం ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటుంది.
ఈ రోజు నర్సాపురంలో ఒక అభిమాని అతి ప్రేమ వల్ల పవన్ కల్యాణ్ పెద్ద ప్రమాదంలో పడేవారు. తృటిలో ప్రమాదం తప్పింది.
రాజమండ్రి నుంచి నరసాపురం ర్యాలీగా వెళ్తున్న టైంలో అపశృతి చోటుచేసుకొంది. పవన్ కళ్యాణ్ కారుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక వెనుక నుంచి సర్రున దూసుకొచ్చాడు. అంతేకాదు అతను పవన్ కల్యాణ్ ని లాగడంతో నిల్చుని అందరికి అభివాదం చేస్తున్న జనసేనాని కారుపైనే పడిపోయారు. ఐతే, పవన్ కళ్యాణ్ వెంటనే తేరుకొని లేచారు. ర్యాలీ యథావిధిగా కొనసాగింది కానీ పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పాలి.
పవన్ కల్యాణ్ ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. “జగన్ అందరూ తన దగ్గరికి వచ్చి వేడుకోవాలి అని కోరుకుంటారు. ఎంత పెద్ద స్థాయి వారైనా ఆయన దగ్గరికి వచ్చి మీరే దయతలిచి చూడాలి అంటే ఆయన ఇగో శాటిస్ ఫై అవుతుంది,” అన్నారు.
మరి ఈ విమర్శల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు వాయిదా పడుతుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.