
మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా మొదలైంది. షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఈ సినిమా మొదలైంది అని చెప్పడానికి టీం “SSMB28ఆరంభం” అనే హ్యాష్ టాగ్ ని వాడింది. దాంతో, ‘ఆరంభం’ అనే టైటిల్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారా అన్న మాట వినిపిస్తోంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తన సినిమాని ప్రకటించినప్పుడు తమ ముగ్గురి పేర్లలోని ‘ఆర్’ అక్షరం తీసుకొని ‘ఆర్ ఆర్ ఆర్’ అనే హ్యాష్ టాగ్ వాడారు. ఆ తర్వాతే అది సినిమా టైటిల్ గా మారింది. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే పద్దతిలో ‘ఆరంభం’ అనే హ్యాష్ టాగ్ ని వాడుతున్నారా?
త్రివిక్రమ్ కి ‘అ’ సెంటిమెంట్ కూడా ఉంది. ‘అతడు’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అత్తారింటికి దారేది’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురంలో’… ఇలా ఆయన చిత్రాల టైటిల్స్ ఎక్కువగా ‘అ’తోనే మొదలయ్యాయి. ఆ లెక్కన ‘ఆరంభం’ కూడా సరిపోతుంది.
సినిమా సగభాగం పూర్తి అయిన తర్వాత టైటిల్ ప్రకటించడం త్రివిక్రమ్ కి అలవాటు. మరి ‘ఆరంభం’ అనే టైటిల్ ని వాడుకుంటారా లేక మరేదైనా ఆలోచిస్తారా అనేది చూడాలి.