
దాదాపుగా అన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’, బాలకృష్ణ మూవీ ‘అఖండ’ మాత్రం ఇంకా డేట్స్ ప్రకటించలేదు. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు మంచి డేట్స్ పోయాయి అని బాధపడిపోతున్నారు. ఐతే, మెగాస్టార్ మాత్రం అన్ని పక్కాగా లెక్కలు వేసుకున్నాకే విడుదల తేదీని ప్రకటించాలని ఆగినట్లు కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం…మరో రెండు, మూడు రోజుల్లో ‘ఆచార్య’ కూడా విడుదల తేదీ కూడా బయటికి వస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివర్లో ఉంది. మరో వారం రోజుల వర్క్ తో గుమ్మడికాయ కొట్టొచ్చు. షూటింగ్ తో సమస్య లేదు. విడుదల ఎప్పుడు అనేదే ప్రశ్న. సంక్రాంతి సీజన్ లో ఆల్రెడీ మూడు, నాలుగు సినిమాలున్నాయి. దసరాకి ఇండియాలోనే అతిపెద్ద మూవీ అయిన “ఆర్ ఆర్ ఆర్” ఉంది. క్రిస్మస్ కి అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప”, కన్నడ పాన్ ఇండియా చిత్రం “కేజీఎఫ్ 2” బరిలోకి దిగుతున్నాయి.
మరి “ఆచార్య”కి సరైన డేట్ ఎప్పుడు దొరుకుతుంది? “ఆచార్య” మేకర్ల మదిలో ఉన్న డేట్ ఏంటో? ఇదే ఆసక్తికరం.
ఐతే, ఇక్కడో విషయం ఉంది. ఇప్పుడు ప్రకటించిన డేట్స్ అన్ని “తాత్కాలికమే”. కరోన వేవ్ ముదిరితే, అన్ని తేదీలు తారుమారు అవుతాయి. ఇప్పుడు ప్రకటిస్తున్న డేట్స్ అన్ని ఆశావహ దృక్పథంతో రిజర్వ్ చేసుకుంటున్నవే.