
ఈ శుక్రవారమే విడుదల ఎప్పటినుంచో మెగాభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆచార్య’. కొరటాల శివ తీసిన ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ అంతా సెకండాఫ్ లోనే అని టాక్. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ద్వీతీయార్ధంలో వస్తుంది.
ఇంటర్వెల్ నుంచి క్లయిమాక్స్ వరకు సాగే సన్నివేశాలు కొరటాల ట్రేడ్ మార్క్ తో సాగుతాయి అని అంటున్నారు. ఇప్పటివరకు ట్రైలర్ లో, టీజర్లో చూసినదానికి భిన్నమైన కథ, కథనాలు ఈ రెండో భాగంలోనే ఉన్నాయట.
నిజానికి దర్శకుడు కొరటాల శివ మొదటి నుంచి తన సినిమాల్లో రెండో భాగంలో కొన్ని హైలెట్ సీన్స్ పెడుతుంటారు. ‘శ్రీమంతుడు’లో తోట ఫైట్, ‘భరత్ అనే నేను’లో థియేటర్ ఫైట్, ‘జనతా గ్యారేజ్’లోనూ రెండో భాగం సన్నివేశాలే ఆకర్షణ. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఉన్నారు కాబట్టి అదే డబుల్ హైలెట్ అనే మాట వినిపిస్తోంది.
దర్శకుడు కొరటాల శివకి ఇప్పటివరకు 100 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు కేటాయించారు. చాలాకాలం షూటింగ్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది వచ్చినా… చివరికి ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారట.