
చాలామందికి సినిమా చూస్తే చాలు చెప్పలేనంత ఉల్లాసం వస్తుంది. రెండు గంటలు అన్ని బాధలు మర్చిపోతారు. ఇక ఇష్టమైన హీరో చిత్రం చూస్తే పొందే మజానే వేరు. ఒక మహిళ మెగాస్టార్ చిరంజీవి సినిమా చూస్తూ తన సర్జరీ బాధని కూడా మరిచిపోయిన వైనం వెలుగులోకి వచ్చింది.
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు రెండు రోజుల క్రితం ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఆమె మెదడులో ఉన్న కణతులను తొలగించారు. ఇది చాలా క్లిష్టమైన సర్జరీ. ఆమెని స్పృహలోనే ఉంచి ఈ ఆపరేషన్ పూర్తి చేశారట. చిరంజీవి చిత్రం ఈ విషయంలో డాక్టర్లకు ఎంతో సాయపడింది.
ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆమె కోసం చిరంజీవి నటించిన పాత చిత్రాన్ని ప్రదర్శించారు. చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమాని సర్జరీ సమయంలో ఆమెకి చూపించారు. ఆమె సినిమా చూస్తూ ఉండగానే వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అడవిదొంగ ఒక మంచి సూపర్ హిట్ మూవీ. “వానా వానా వందనం” వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆ మూవీలో. 1985లో విడుదలైన ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకుడు. రాధా హీరోయిన్ గా నటించారు.