2022కి జోరుగా అడ్వాన్స్ బుకింగ్!

ఒకప్పుడు వచ్చే వారంలో ఏ సినిమా విడుదలవుతుందో తెలిసేది కాదు. అలాంటి అయోమయ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలు మారిపోయారు. పాన్ ఇండియా మంత్రం జపిస్తూ రిలీజ్ డేట్స్ ఏడాది ముందే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రావాల్సిన పెద్ద సినిమాల డేట్స్ అన్ని తెలిసిపోయాయి. ఇక ఇప్పుడు 2022 క్యాలెండర్ ఇయర్ కూడా ముందే బుక్ అవుతోంది.

సంక్రాంతి 2022కి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు పోటీపడుతున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ – క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ (పరిశీలనలో ఉంది) సినిమాలు పొంగల్ కి డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి.

ఇక లేటెస్ట్ గా 2022 వేసవిలో కూడా ఒక సినిమా తన డేట్ ని ముందే అనౌన్స్ చేసింది. అదే… ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘సలార్’. ఇది ఏప్రిల్ 14, 2022న విడుదల కానుంది. అలాగే, ఆగస్టు 11, 2022న ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ కూడా రిలీజ్ అవుతాయి.

త్వరలోనే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా, శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చే సినిమాల విడుదల తేదీలు కూడా ప్రకటిస్తారట. ఆ రేంజులో దూకుడు చూపుతున్నారు తెలుగు నిర్మాతలు. వచ్చే ఏడాదికి ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్.

More

Related Stories