
సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకి దర్శకత్వం, రచనపై చాలా ఆసక్తి. పెద్ద సూపర్ స్టార్ కూతురైనా ఆమె పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత దర్శకురాలిగా మారారు. ఇప్పటివరకు మూడు చిత్రాలు తీయగా ఒకటి ఓ మోస్తరుగా అడగా, మిగతా రెండూ దారుణంగా పరాజయం పాలు అయ్యాయి.
ఆమె తన భర్త ధనుష్ హీరోగా “3” అనే చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. అందులో “కొలవరి” పాట బాగా హిట్ అయింది. పాట వల్ల వచ్చిన క్రేజ్ తో మొదటి రోజు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం నిలబడలేదు. అలా మొదటి చిత్రంతోనే ఆమె దర్శకురాలిగా అపజయం అందుకున్నారు.
ఇక రెండో సినిమాగా “వాయ్ రాజా వాయ్” అనే చిత్రం తీశారు. ఇది ఫ్లాప్ కాదు కానీ సో సోగానే ఆడింది. అది చిన్న చిత్రం కాబట్టి పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. మూడో చిత్రంగా “లాల్ సలామ్” డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరో విష్ణు విశాల్. కానీ తన తండ్రి చిన్న పాత్ర పోషిస్తే సినిమాకి క్రేజ్ వస్తుందని ఒక ముస్లిం వ్యాపారి పాత్రని ఇచ్చారు. రజినీకాంత్ ఈ సినిమాలో పోషించిన పాత్రని గెస్ట్ రోల్ అనలేం. ఒక పెద్ద పాత్ర అని చెప్పొచ్చు.
కానీ, ఈ సినిమాకి సరైన ఓపెనింగ్ కూడా దక్కలేదు. మొదటి వీకెండ్ కలెక్షన్ ట్రెండ్ ని బట్టి ఇది నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది.

రజినీకాంత్ నటించినా సరైన ఓపెనింగ్ రాకపోవడం ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. అలా ఐశ్వర్య ఖాతాలో ఇప్పటివరకు దర్శకురాలిగా బ్లాక్ బస్టర్ అనేది ఖాతాలో పడలేదు.