
నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా ఇప్పటికే కొన్ని సినిమాలు చేశాడు. అందులో ‘నేను రౌడీనే’ వంటివి ఒకటో, రెండో ఆడాయి. అందుకే, అతని కెరీర్ లో పెద్దగా ఎదుగుదల లేదు. ఐతే, ఇటీవల అగ్ర హీరో అజిత్ అతనితో సినిమా చేసేందుకు అంగీకరించడంతో అందరూ షాక్ తిన్నారు.
అజిత్, విగ్నేష్ శివన్ సినిమా గురించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. విగ్నేష్ శివన్ మూడు నెలల పాటు స్క్రిప్ట్ మీద కూర్చొని ఇటీవలే ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. ఐతే, కథ మొత్తం విన్న తర్వాత అజిత్ కి ఈ స్క్రిప్ట్ సరిగా లేదని భావించారట. దాంతో, ఆయన ఈ సినిమాని పక్కన పెట్టి ఇంకో దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు టాక్.
ఇదే నిజమైతే, నయనతార భర్తకి ఇది పెద్ద షాక్.
సూర్యతో తీసిన ‘గ్యాంగ్’ మినహా ఇప్పటివరకు పెద్ద హీరోలతో సినిమాలు తీయలేదు విగ్నేష్. ఆ మధ్య శివ కార్తికేయన్ తో సినిమా ప్లాన్ చేస్తే అది ముందుకు కదలలేదు. ఇప్పుడు అజిత్ కూడా తన సినిమాని పక్కన పెట్టి మరో సినిమా ఒప్పుకోవడంతో విగ్నేష్ శివన్ కి పెద్ద ఇబ్బందే.