అఖండ – తెలుగు రివ్యూ

Akhanda

బాలయ్య-బోయపాటి సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారు? దీనికి సమాధానం అందరికీ తెలుసో తెలియదో చెప్పలేం కానీ, బోయపాటికి మాత్రం బాగా తెలుసు. బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ దర్శకుడు, ఈసారి కూడా బాలయ్య కోసం, అతడి ఫ్యాన్స్ కోసం అఖండ రూపంలో ఫుల్ సెటప్ సిద్ధం చేసి పెట్టాడు. అయితే ఈ క్రమంలో కథను, లాజిక్స్ ను పూర్తిగా గాలికొదిలేశాడు. ఇదొక సింపుల్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే గతంలో బోయపాటి తీసిన లెజెండ్ సినిమాకు చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే దీనికి బాలయ్య మార్క్ యాక్షన్, తన మార్క్ టేకింగ్ జోడించాడంతే.

అనంతపురంలోకి ఓ ఊరి పెద్దకు కవలలు జన్మిస్తారు. వాళ్లలో ఒకరు రైతు మురళీకృష్ణ (బాలకృష్ణ), మరొకరు అఖండ (బాలయ్య)గా ఎదుగుతారు. దైవాంశతో పుట్టిన అఖండను చిన్నప్పుడే తల్లి నుంచి విడదీసి అఘోరాగా పెంచుతారు. ఊరికి ఓ సమస్య వస్తుంది. అక్రమ మైనింగ్ తో ప్రజలు కష్టాలు పడుతుంటారు. ఓ దశలో మురళీకృష్ణ కట్టించిన హాస్పిటల్ ను కూడా దుండగులు పేల్చేస్తారు. ఇక మురళీకృష్ణ వల్ల కాదనుకున్న టైమ్ లో అఖండ సీన్ లోకి వస్తాడు. దుష్టుల్ని శిక్షిస్తాడు, జనాల్ని కాపాడతాడు.

ఈ క్రమంలో అఖండ తన తల్లిని కలవడం లాంటి ఎమోషనల్ సన్నివేశాలు, మురళీకృష్ణ ఆ జిల్లా కలెక్టర్ ప్రగ్యా జైశ్వాల్ తో ప్రేమలో పడడం లాంటి రొమాంటిక్ సీన్లు చూపించాడు బోయపాటి. ఓవైపు ఈ పని చేస్తూనే, మరోవైపు సినిమాలో స్ట్రయిట్ గా పాయింట్ లోకి వెళ్లిపోయాడు బోయపాటి. మొదటి భాగంలో బాలయ్య-ప్రగ్యాజైశ్వాల్ రొమాన్స్, ఆ తర్వాత బాలయ్య ఎలివేషన్స్, అతడి మంచితనం లాంటి సన్నివేశాలు అలా వచ్చేస్తుంటాయి. ఇవన్నీ మనం ఊహించినవే, ఇంతకు ముందు చూసేసినవే. కాకపోతే ఈ ఎక్సర్ సైజ్ అంతా బాలయ్య రెండో పాత్ర అఖండ కోసమనే విషయం ప్రేక్షకుడికి కూడా అర్థమైపోతుంటుంది. ఆశ చచ్చిపోయినప్పుడు, చెడు ఎక్కువైపోయినప్పుడు అఖండ వస్తాడు. ఇక అక్కడ్నుంచి బాలయ్య అభిమానులకు జాతరే.

దైవాంశసంభూతుడిగా, శక్తిమంతమైన అఘోరాగా బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి సినిమా ఊపందుకుంటుంది. బాలయ్య పంచ్ డైలాగ్స్, వీరావేశంతో చేసే ఫైట్స్ ఫ్యాన్స్ తో చప్పట్లు కొట్టిస్తాయి. ఇలాంటి ఎలివేషన్లపై దృష్టిపెట్టిన బోయపాటి, ఈసారి ఎమోషన్స్ ను మిస్సయ్యాడు. సింహా, లెజండ్ సినిమాల్లో పండిన స్థాయిలో అఖండలో ఎమోషన్ పండలేదు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ప్రేక్షకుడు డిస్-కనెక్ట్ అయ్యాడు. అయినప్పటికీ బోయపాటి తన మార్క్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా బండి లాగించే ప్రయత్నం చేశాడు.

సినిమాలో మరో లోపం విలనిజం. బోయపాటి సినిమాల్లో విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టే హీరోయిజం కూడా ఆ రేంజ్ లో పండుతుంది. కానీ ‘అఖండ’లో విలన్ వీక్ అయిపోయాడు. అతడికి సరైన ఎలివేషన్స్ కాదు కదా, కనీసం సరైన సీన్లు కూడా పడలేదు. పేరుకు ముగ్గురు నలుగురు విలన్లు ఉన్నప్పటికీ ఎవ్వరికీ బోయపాటి స్కోప్ ఇవ్వలేదు. తన నెరేషన్ లో మంచి స్థానం కల్పించలేదు. సినిమా మొత్తం అఖండ ఎలివేషన్స్ పైనే నడిచింది. ఫైట్స్ కొరియోగ్రఫీ అదిరింది కానీ, ఒక దశలో అఖండ ఎందుకు ఫైట్ చేస్తున్నాడనే అనుమానం వస్తుంది. దైవాంశ సంభూతుడిగా ఒక చేయి ఊపుతో విలన్లను ఆమడ దూరం ఎగరేస్తున్న అఖండుడు అంత కష్టపడి ఫైట్ చేయడం ఎందుకనే డౌట్ కలుగుతుంది. కేవలం బాలయ్య ఎలివేషన్స్ కోసమే బోయపాటి, స్టంట్ కొరియోగ్రాఫర్ ఇంత కష్టపడ్డారని సర్దిచెప్పుకోవాలి.

సినిమాలో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది అఖండ క్యారెక్టరైజేషన్, బాలయ్య పెర్ఫార్మెన్స్ మాత్రమే. ఈ రెండు మినహా అఖండలో ఇంకేం లేదు. అటు వినోదం, ఇటు రొమాన్స్ ఏ కోశాన వెదికినా కనిపించదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు బోయపాటి లాజిక్స్ పట్టించుకోకుండా సినిమా తీశాడు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్, పూర్ణ పాత్ర తీరుతెన్నులు దీనికి ఎగ్జాంపుల్స్

బాలయ్య అభిమానులకు మాత్రం అఖండ ఫుల్ మీల్స్ లాంటిది. ఒక మాట నువ్వంటే శబ్దం, నేనంటే శాసనం లాంటి డైలాగులు థియేటర్లో బాగా పేలాయి. అఖండగా బాలకృష్ణ అదరగొడితే, మురళీకృష్ణగా మరో బాలయ్య తేలిపోయాడు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో మురళీకృష్ణ పాత్రకు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

తన సినిమాల్లో హీరోయిన్లను చాలా పైస్థాయిలో చూపిస్తాడు బోయపాటి. సరైనోడు సినిమాలో హీరోయిన్ ను ఎమ్మెల్యేగా చూపించిన ఈ దర్శకుడు.. అఖండలో ప్రగ్యాను కలెక్టర్ గా చూపించాడు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ హోదాలన్నీ జస్ట్ పరిచయ కార్యక్రమం వరకే, ఆ వెంటనే హీరోయిన్లు హీరో వెంట పడతారు. సగటు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రవర్తిస్తారు. ‘అఖండ’లో కూడా అదే జరిగింది. ముఖ్యంగా కలెక్టరమ్మతో ఆవకాయ బద్దని నాకు అనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం పాత్ర ఔచిత్యం దెబ్బతింది.

ఇక విలన్ గా నటించిన శ్రీకాంత్ బాగానే చేసినప్పటికీ.. లెజెండ్ లో జగపతిబాబుకి ఇచ్చిన స్థాయి లేదు.

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. జై బాలయ్య, అఖండ టైటిల్ సాంగ్స్ ను బాగా కంపోజ్ చేశాడు తమన్. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ లో కెమెరా పనితనం కనిపించింది.

బాటమ్ లైన్: ఓవరాల్ గా బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. అఖండగా బాలయ్య మెప్పించినప్పటికీ సుదీర్ఘమైన యాక్షన్ సీన్స్, అవసరం లేని డైలాగ్స్ సినిమాను వీక్ చేశాయి.

Rating: 2.75/5

by ‘పంచ్’ పట్నాయక్

 

More

Related Stories