
ఒకప్పుడు కామెడీ చిత్రాలకు మాత్రమే కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు అల్లరి నరేష్. మరీ ముఖ్యంగా “నాంది” సక్సెస్ అయిన తర్వాత అల్లరోడి మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.
ఓవైపు కామెడీ జానర్ లో సినిమాలు చేస్తూనే, మరోవైపు కాన్సెప్ట్ మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఓ సినిమా ప్రకటిస్తే, అది కామెడీ సినిమానా, కాన్సెప్ట్ మూవీనా అనే డౌటానుమానాలు అందర్లో కలుగుతున్నాయి. ఈసారి కూడా అలాంటి అనుమానాలే కలిగేలా చేశాడు.
ఈరోజు కొత్త సినిమా లాంఛ్ చేశాడు. అల్లరి నరేష్, ఆనంది హీరోహీరోయిన్లుగా జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో మోహన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇది సీరియస్ మూవీ కాదు. పూర్తిస్థాయిలో హాస్యభరిత చిత్రం. కాకపోతే కామెడీతో పాటు ఓ 30శాతం సెంటిమెంట్, యాక్షన్ కూడా ఉంటుందంటున్నారు నిర్మాతలు.
ఈసారి అల్లరోడితో పాటు కామెడీ పంచడానికి వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కూడా తోడయ్యారు. ఈ గ్యాంగ్ అంతా కలిసి సరికొత్త నవ్వులు పంచబోతోంది. అబ్బూరి రవి ఈ సినిమాకు మాటలు అందిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు.