
అమలా పాల్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి ఒక కారణం ఉందట. అవకాశాలు రాలేదు కాబట్టే ఆమె ఎక్కువ సినిమాలు చెయ్యలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ, తానే అనేక సినిమాలు కావాలనే ఒప్పుకోలేదంట. వచ్చిన ఆఫర్లను తిరస్కరించిందట. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు బయటపెట్టింది.
తెలుగులో ఆమె నాగ చైతన్య సరసన ‘బెజవాడ’లో, రామ్ చరణ్ సరసన ‘నాయక్’లో, అల్లు అర్జున సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నాని సరసన ‘జెండాపై కపిరాజు’లో కూడా కనిపించింది. ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నీ పేరొందిన హీరోల చిత్రాలే కావడం విశేషం. ఐతే, అన్ని సినిమాల్లో మరో హీరోయిన్ తో కలిసి నటించాల్సి వచ్చింది.
“గ్లామర్ షో, మరో భామతో కలిసి నటించడం… ఇవే దక్కాయి తెలుగులో. అందుకే, తమిళ్ చిత్రాలు ఒప్పుకుంటూ తెలుగుని పట్టించుకోలేదు,” అనే తెలిపింది.

ఆమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా పెద్ద హిట్ కాలేదు. ‘నాయక్’ ఒక్కటే కాస్త పర్వాలేదు అనిపించుకొంది. అందుకే, ఆమెకి క్రేజ్ రాలేదు. ఇది వాస్తవం. ఐతే, ఆమె మాత్రం మరో భామతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకే తెలుగులో నటించలేదు అని చెప్పుకుంటోంది.