
అమలా పాల్ ఒక పంజాబీ నటుడు, గాయకుడిని పెళ్లి చేసుకుందని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. వాళ్ళ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఐతే, అది పెళ్లి కాదని ఒక ప్రమోషనల్ వీడియో షూట్ అని అప్పట్లో చెప్పింది అమలా పాల్.
తర్వాత ఆమె వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారారు. గతవారం ఆ పంజాబీ గాయకుడు భవనిందర్ సింగ్ పై ఆమె కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. అతను తన మాజీ స్నేహితుడనీ, ఇప్పుడు కొన్ని ఫోటోలు బయటపెడుతాను అని చెపుతూ తనని లైంగికంగా వేధిస్తున్నాడు అని అమలా పాల్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, పోలీసులు అతన్ని అరెస్ట్ చెయ్యడం చకచకా జరిగిపోయాయి.
తాజాగా అతనికి కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టులో ఆయన సమర్పించిన ఆధారాలు వల్లే అతనికి బెయిల్ వచ్చిందట.
ఆ రుజువులు ఏంటంటే… 2017లో వీరిద్దరూ పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఫోటోలు, వీడియోలు. అమల బుకాయిస్తున్నట్లుగా అవి ఒక యాడ్ కోసమో, పాట కోసమో చేసిన షూట్ కాదని, నిజంగా పెళ్లి జరిగినట్లు ఆధారాలు చూపాడట భవనిందర్ సింగ్. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల వల్లే విడిగా ఉంటున్నాం కానీ తామిద్దరం లీగల్ గా భార్యాభర్తలమే అని అతను వాదిస్తున్నాడు. కోర్టు అతని మాటని నమ్మి బెయిల్ ఇచ్చిందట.
అంటే, ఇప్పటివరకు అమలా పాల్ చెప్పిన విషయాలు తప్పేనా? ఆమె అబద్దాలతో కోర్టులో అడ్డంగా దొరికిందా? వాటికి సమాధానం తేలాలంటే ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.