ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్సులు, అలాగే కొన్ని వైరల్ ఆడియో, వీడియోలు వచ్చాయి. అప్పటినుంచి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. తాజాగా విడుదలైన “బ్రో” సినిమాలో తనని టార్గెట్ చేస్తూ శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టారని మంత్రి ఆరోపించారు. అంతేకాదు, త్రివిక్రమ్ లాంటివారు ఇకపై ఇలాంటివి రిపీట్ చేస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.
కొంతకాలం క్రితం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పృథ్వితో ఆ పాత్ర చేయించడం విశేషం. ఐతే, ఈ పాత్ర ఎవరి గురించి అనే విషయంలో చాలామందికి సరిగా క్లారిటీ లేదు. ఆ పాత్ర తన గురించే అని అంబటి రాంబాబు ఇప్పుడు అందరికీ తెలియచేశారు.
“సినిమాల్లో ఎవణ్ణి పడితే వాన్ని గోకితే సక్సెస్ కావు అని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. దమ్ముంటే మొత్తంగా పొలిటికల్ సెటైరికల్ మూవీస్ తీసుకోవచ్చు. దానిలో ఎవరి పేరు అయినా పెట్టుకోవచ్చు. శ్యామ్ బాబు ఎందుకు రాంబాబు అని పెట్టుకొండి. ఎవడూ కాదన్నాడు,” అంటూ మంత్రి మాట్లాడారు.
అంతే కాదు, తెలుగు చిత్రసీమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, రచయితలు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.