అమిత్ షా, కేసీఆర్… ఎన్టీఆర్!


‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగాలి. సరిగ్గా నాలుగు గంటలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. వినాయక వేడుకల బందోబస్తు, గతంలో ‘సాహో’ సినిమా ఈవెంట్ సమయంలో అభిమానులు సృష్టించిన హంగామా గురించి ప్రస్తావిస్తూ పోలీసులు ఈవెంట్ కి అనుమతి ఇవ్వలేదు. ఇది కేవలం పైకి చెప్పే కారణం.

ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాజమౌళి ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ ఈవెంట్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికప్పుడు పార్క్ హయత్ లో రాత్రి 9 గంటలకు ప్రెస్ మీట్ గా మార్చేశారు. రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్, రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్ … ఏ ప్రెస్ మీట్ కి హాజరయ్యారు.

ఈవెంట్ కి అనుమతి ఇవ్వకపోవడానికి అసలు రీజన్ మాత్రం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే. తెలంగాణాలో బలపడాలని అనుకుంటున్న బీజేపీ తాజాగా సినిమావాళ్లను తమ ‘ఫోల్డ్’లోకి తీసుకుంటోంది. ఇప్పటికే మీడియా అధిపతులను తమకు అనుకూలంగా మల్చుకుంది బీజేపీ. అందులో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల ఎన్టీఆర్ ని కలిశారు. అదే రోజు మీడియా మొఘల్ రామోజీరావుతో అమిత్ షా భేటీ జరిగింది.

ఇక రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కొంతకాలంగా ఆరెస్సెస్ అనుకూల చిత్రాలు తీస్తున్న విషయం తెల్సిందే. వాళ్ళు బీజేపీ మనుషులే అన్న ముద్ర ఇప్పటికే పడింది.

జరుగుతున్న పరిణామాలను చూసి… కేసీఆర్ ప్రభుత్వం ఈ ఈవెంట్ కి పోలీసుల అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీ, రాజమౌళి, ఎన్ఠీఆర్… ఆల్ బీజేపీ గ్యాంగ్ అనే ఉద్దేశంతోనే ఇలా కేసీఆర్ గవర్నమెంట్ చేసి ఉంటుందని మీడియా వార్తలు.

మొత్తమ్మీద, జూనియర్ ఎన్టీఆర్ … అటు అమిత్ షా, ఇటు కెసిఆర్ రాజకీయంలో ఇరుక్కున్నారు.

Advertisement
 

More

Related Stories