
గాయకుడు సరిగానే ఉచ్చరిస్తున్నా మనకే సరిగా వినిపించడం లేదట. ఎందుకంటే మన చెవులు కొత్త టెక్నాలజీకి ‘అడ్జెస్ట్’ కాలేదంట. ఈ గొప్ప మాట అన్నది ఎవరో కాదు పాటల రచయిత అనంత శ్రీరామ్. ఒకప్పుడు కాస్త పద్దతిగానే రాసేవాడు అనంత శ్రీరామ్. ఇప్పుడు ప్రాసల ప్రయాసలో అర్థం పర్థం లేని పదాలు వాడేస్తున్నారు శ్రీరామ్. ఆయనే తప్పుగా రాస్తున్నాడు అంటే అంతకన్నా ఘోరంగా ఉచ్చరిస్తున్నారు సైడ్ శ్రీరామ్.
ఐతే, ‘సర్కారు వారి పాట’ సినిమాలో ‘కళావతి’ పాటలో అనేక లిరిక్స్ అసంబద్ధంగా ఉన్నాయి. దానికి తోడు ఉచ్చారణ దోషాలు ఎక్కువే. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో తరంగ్ కి ట్రాంగ్ అని పాడారు సిద్ శ్రీరామ్. కానీ అతన్ని వెనకేసుకొచ్చారు ‘తప్పుల పాటల’ అనంతం.
అనంత శ్రీరామ్ ఇచ్చిన వివరణ చూడండి.
“కళావతి పాట విషయానికి వస్తే అతని ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. నేను దగ్గర వుండి పాడించాను. ఐతే అతని గత పాటల్లో తెలుగు పరిచయం లేకపోవడంతొ కొన్ని తప్పులు జరిగుండొచ్చు. అదే మూడ్ లో వినేసరికి ఏదో తప్పుగా ఉచ్చరిస్తున్నారనే భావనే తప్పా .. కళావతి పాట ఉచ్చారణలో ఎలాంటి దోషాలు లేవు. పాట మిక్స్ చేసినపుడు కొన్ని ఎఫెక్ట్స్ వేస్తారు. దాని కారణంగా కూడా కొన్ని పదాలు వేరేగా వినిపించవచ్చు. పెరిగిన టెక్నాలజీకి మన చెవులు ఇంకా సిద్ధపడలేదని నా అభిప్రాయం.”
పాటకు తగ్గట్లుగా మన చెవులు ఎలా మారుతాయి? ఇదిగో ఆయన సమాధానం.
“ఒక బుల్లెట్ పేలిస్తే కనిపించదు. కానీ సినిమాలో దాన్ని స్లో మోషన్ లో చూపిస్తే అది అసహజమే అయినప్పటికీ చూస్తున్నాం కదా. ప్రతిదాంట్లో టెక్నాలజీ వస్తుంది. దీనికి కళ్ళు ఎలా సిద్ధపడుతున్నాయో చెవులు కూడా అలా సిద్ధపడాలి.”
ఏమి సెప్తిరి? ఏమి సెప్తిరి. అనంత శ్రీరామ్ రాసే పిచ్చి ప్రాసల పాటలు సిద్ శ్రీరామ్ పాడితే మనం ‘శ్రీరామ్’ల చెవులు తగిలించుకోవాలి. అదన్నమాట.