‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్: అనిక

Anikha Surendran


అనిక సురేంద్రన్ బాలనటిగా పాపులర్. అజిత్, నయనతార జంటగా నటించిన ‘విశ్వాసం’లో కూతురిగా నటించింది. అలాగే, గతేడాది నాగార్జున హీరోగా నటించిన ‘ఘోస్ట్’ సినిమాలో టీనేజీ పిల్లగా అలరించింది. ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం… ‘బుట్ట బొమ్మ’. ఈ నెల 26న విడుదల కానుంది ఈ మూవీ. అనికతో అనేక ముచ్చట్లు….

హీరోయిన్ గా నటించడం ఎలా ఉంది?

సినిమాలు కొత్త కాదు. బాలనటిగా ఎన్నో సినిమాలు చేశా. హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పుడు థ్రిల్లింగ్ గా అనిపించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ‘బుట్ట బొమ్మ’… మలయాళంలో హిట్టయిన “కప్పేల”కి రీమేక్. మలయాళ వెర్షన్ నచ్చింది. పాత్ర కూడా బాగుంది. అందుకే ఒప్పుకున్నా.

హీరోయిన్ పాత్ర పోషించినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా?

బాలనటిగా నటించడం వేరు. హీరోయిన్ గా చెయ్యడం వేరు. థ్రిల్ తో పాటు ఒత్తిడి కూడా ఉంది. ఐతే, దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని చేశా. దర్శకుడు రమేష్ గారు ఎంతో మద్దతు ఇచ్చి, ఒత్తిడికి గురి కాకుండా చూసుకున్నారు. అలాగే నాకు తెలుగు రాదు కాబట్టి మొదట్లో కొంచెం కష్టం ఐంది. సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను.

బుట్టబొమ్మ, కప్పేలా సేమ్ టు సేమా?

కథ అదే కానీ తెలుగులో కొన్ని మార్పులు చేశారు. తెలుగువారికి నచ్చేలా కలర్ ఫుల్ గా ఉంటుంది.

తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తారా?

మొదటి సినిమానే సితార వంటి పెద్ద సంస్థలో చేయడం కలిసొచ్చింది. విడుదలకు ముందే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

 

More

Related Stories