అనుభవించు రాజా – తెలుగు రివ్యూ

Anubhavinchu Raja

ఓ పెద్ద బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అంచనాలుంటాయి. కాస్టింగ్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మొదటి ఆట చూడ్డానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కూసింత ఆసక్తిగా థియేటర్లలోకి వచ్చిన జనాలకు చుక్కలు చూపించింది అన్నపూర్ణ స్టుడియోస్ సంస్థ. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘అనుభవించు రాజా’ అనే సినిమా చూస్తే… ‘ఒకటే అనిపిస్తుంది… థియేటర్ కి వచ్చారు కదా మీ ఖర్మ అనుభవించండి’ అని.

రాజ్ (రాజ్ తరుణ్) ఫుల్ రిచ్. అతడి తాత చనిపోతూ బోలెడంత ఆస్తి ఇస్తాడు. తనలా కాకుండా, లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయమని చెప్పి కన్నుమూస్తాడు. రాజ్ కూడా అనుభవించే ప్రాసెస్ లోనే ఉంటాడు. కాకపోతే అంతలోనే ఓ ఘటన జరుగుతుంది. దాంతో అనుభవించాల్సిన రాజాగారు హైదరాబాద్ వచ్చి పడతాడు. సెక్యూరిటీ గార్డ్ అవతారం ఎత్తుతాడు. పనిలోపనిగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శృతి (కషిష్ ఖాన్)తో ప్రేమలో పడతాడు. రిచ్ గయ్ రాజ్ ఎందుకు ఊరి వదిలిపెడతాడు? సెక్యూరిటీ గార్డ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? హీరోయిన్ ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ స్టోరీ.

ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే సినిమా తీసి, కామెడీ టచప్ ఇస్తే అదో లెక్క. ఇలాంటి సాఫ్ట్ స్టోరీలోకి క్రైమ్, సస్పెన్స్, సుపారీ గ్యాంగ్ ను చొప్పిస్తే ఎలా ఉంటుంది? “అనుభవించు రాజా సినిమా” అలా ఎటూ కాకుండా అయింది. ఓ హై-ప్రొఫైల్ బ్యానర్ నుంచి ఇలాంటి సినిమా రావడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా కథ, స్క్రీన్ ప్లే విని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే సందేహం కలుగుతుంది.

వినోదం పంచుతుందనుకున్న ఈ సినిమా ఆ వినోదం కాదు కదా ఏ అనుభూతిని అందించలేకపోయింది. ఈ సినిమా కథ చాలా వీక్. ఈ ఐడియా చాలా ఔట్ డేడేటెడ్. దీంతో దర్శకత్వం కూడా గతుకుల రోడ్డులో ప్రయాణాన్ని తలపిస్తుంది. సినిమాలో నటుడు అజయ్ ఓ డైలాగ్ చెబుతాడు. ఫినిషింగ్ టచ్ ఇచ్చే టైమ్ వచ్చిందంటాడు. అప్పటికే సినిమా చూసి నీరసించిన ప్రేక్షకుడు, ఇంకా ముందే ఫినిషింగ్ టచ్ ఇస్తే బాగుండేదని ఫీల్ అవుతాడు. నెరేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది.

ఒక దశలో ఈ సినిమా ఎలా అనిపిస్తుందంటే, ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ లో సెక్యూరిటీ గార్డ్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమకు కేటాయించిన దర్శకుడు.. సెకెండాఫ్ ను భీమవరం బ్యాక్ డ్రాప్, ఫ్లాష్ బ్యాక్, సంక్రాంతి ఎపిసోడ్స్ లాంటి వాటికి అంకితం చేశాడు. ఆ సంక్రాంతి ఎపిసోడ్ మినహా, ఈ రెండు భాగాల్లో ఏదీ ఆకట్టుకోదు. చివరికి అత్యంత కీలకమైన ట్విస్ట్ కూడా తేలిపోవడంతో, క్లైమాక్స్ కు వచ్చేసరికి ‘ఓస్ ఇంతేనా’ అనే ఫీలింగ్ వస్తుంది.

రాజ్ తరుణ్ తన శక్తిమేరకు నటించాడు. కానీ అందులో కొత్తదనం లేదు. కొత్తమ్మాయి కశిష్ ఖాన్ చేసిందేమి లేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో ఎవరూ కూడా బాగా నటించారు అనడానికి ఏమి లేదు. గోపీసుందర్ మ్యూజిక్ ఫెయిల్ అయింది. ఒక్క మంచి ట్రాక్ కూడా లేదు. దర్శకుడు శ్రీను గవిరెడ్డి మరోసారి నిరాశపరిచాడు. గతంలో “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” అనే సినిమా తీసిన ఈ డైరక్టర్, ఈసారి కూడా గతుకుల స్క్రీన్ ప్లే తో బోల్తా పడ్డాడు.

బాటమ్ లైన్: ఓవరాల్ గా “అనుభవించు రాజా” ఒకటే అనుభవం మనకు మిగుల్చుతుంది. అదే … బోర్!

Rating: 1.5/5

పంచ్ పట్నాయక్

Advertisement
 

More

Related Stories