అనూప్ రాగాలు ఊపందుకున్నాయి

ఒక్క పాట.. ఒకే ఒక్క పాట అనూప్ ను మళ్లీ ట్రాక్ ఎక్కించింది. అవును.. ఇప్పుడీ సంగీత దర్శకుడు రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. ఓవైపు లాక్ డౌన్ తో సినిమాలన్నీ చతికిలపడినప్పటికీ అనూప్ ఊపు మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు కమిట్ అవుతూ.. తన జోరు చూపిస్తున్నాడు. 2013-14 తర్వాత అనూప్ ఇంత బిజీ అవ్వడం మళ్లీ ఇదే.

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాకు అనూప్ ఇచ్చిన “నీలినీలి ఆకాశం” అనే పాట మామూలుగా హిట్టవ్వలేదు. ఒక చిన్న సినిమాకు ఇచ్చిన ఈ పాట పెద్ద పెద్ద సినిమా సాంగ్స్ నే కొట్టేసిందంటే పాట ఏ రేంజ్ లో హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు “ఒరేయ్ బుజ్జిగా” సినిమాలో కూడా ఓ 2 పాటలు హిట్టవ్వడం అనూప్ కు ప్లస్ అయింది.

దీంతో తమ సినిమాకు ఒక్క హిట్ పాట ఇచ్చినా చాలంటూ అడ్వాన్సులతో క్యూ కడుతున్నారు నిర్మాతలు. అలా ఇప్పటివరకు 5 సినిమాలకు కమిట్ అయ్యాడు అనూప్. అది కూడా కేవలం ఈ 3 నెలల్లోనే.

వీటిలో “ఓదెల రైల్వే స్టేషన్”, “కోతికొమ్మచ్చి”, రాజ్ తరుణ్ కొత్త సినిమా లాంటివి ఉన్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన సినిమాలు మరో మూడున్నాయి. ఈ లిస్ట్ చాలు అనూప్ రాగాలు ఊపందుకున్నాయని చెప్పడానికి.

Related Stories