
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాల్లో టికెట్ రేట్లను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. బి, సి సెంటర్లలో టికెట్ రేట్లను 30 రూపాయలకే పరిమితం చెయ్యడం శరాఘాతంలా తగిలింది సినిమా పరిశ్రమకి. దాంతో, పెద్ద సినిమాల విడుదల అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వంతో మాట్లాడేందుకు పలుసార్లు మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నించిన్పప్పటికీ కరోనా కారణంగా ముఖ్యమంత్రి జగన్ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చర్చలకు పిలిచారు.
సినీపెద్దలతో కలిసి వచ్చి సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. “ఈ కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి ..టిక్కెట్ రేట్ల గురించి, సిని కార్మికుల బతుకు తెరువు సహా, పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉందని,” సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు ఈ నెల చివరి వారంలో ఏపీ సీఎంతో భేటీకి సిద్ధమవుతున్నారు సినీ ప్రముఖులు.