
ఈ నెలాఖరులోపు టికెట్ రేట్ల పెంపు ఉంటుంది అని చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబుతో కూడిన బృందం గట్టిగా నమ్మింది. ప్రభుత్వం అంత ధీమాగా చెప్పడంతో ‘పది’ రోజులు తీపి కబురు ఉంటుందని వారంతా చెప్పారు. దానికి తగ్గట్లే ఫిబ్రవరి 17న టికెట్ రేట్ల కమిటీ సమావేశమైంది. కానీ, ఇప్పటివరకు టికెట్ రేట్ల పెంపు నిర్ణయం వెలువడలేదు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ మొదటివారం పూర్తి చేసుకున్న తర్వాతే కొత్త జీవో వస్తుందని టాక్. పైగా, పాత పద్దతిలో అధికారుల వేధింపులు మొదలయ్యాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాని గవర్నమెంట్ రేట్లకే టికెట్ రేట్లు అమ్మాలని, ఎక్స్ట్రా షోలు వెయ్యొద్దు అని రెవెన్యూ శాఖ సిబ్బంది థియేటర్లకు ఫోన్ చెప్తున్నారు.
“ముందు జాగ్రత్త”గా చెప్తున్నాం, ఆ తర్వాత దాడులు జరిగాయి అని బాధపడొద్దు అని అధికారులు థియేటర్ల ఓనర్లకు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు అని టాక్.
‘భీమ్లా నాయక్’ సినిమాకి ఎటువంటి బెనిఫిట్స్ దక్కకూడదని జగన్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కడప జిల్లాలో ఇప్పటికే అధికారులు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం అయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయి. బెనిఫిట్ షోలు వేసినా, టికెట్ రేట్లు పెంచినా థియేటర్లని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ మొత్తం వివాదం (టికెట్ రేట్ల తగ్గింపు) పవన్ కళ్యాణ్ ని కట్టడి చేసేందుకే జగన్ ప్రభుత్వం చేసిందని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఐనా, అదే పద్దతిలో వెళ్తోంది వైఎస్సార్సీ గవర్నమెంట్.
రిలీజ్ తర్వాత థియేటర్ల వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి టికెట్ రేట్లని పరిశీలిస్తారట. ఎలాగూ, వారం రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ ‘బాగు’ కోసం రేట్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు, ఈ సినిమా “బాగు”పడితే వచ్చే ఇబ్బంది ఏంటో!