
తెలుగు సినిమాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కరుణ చూపింది. నిబంధనల ఉల్లంఘన పేరిట రాష్ట్రంలో 100 సినిమా థియేటర్లను మూసివేశారు అధికారులు. ఐతే, ఇప్పుడు వాటిని తెరిచే అవకాశం వచ్చింది. నెల రోజుల్లో అన్ని సరిచేసుకొని, ప్రభుత్వం వద్ద సర్టిఫికెట్లు పొందాలని చెప్పింది ప్రభుత్వం.
నెల రోజుల డెడ్లైన్ విధించి థియేటర్లని మళ్ళీ తెరిచే అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఈ రోజు ఆయనని కలిసి థియేటర్ల, టికెట్ సమస్యలపై మాట్లాడారు. వెంటనే సీజ్ చేసిన థియేటర్లకు నెల గడువు లభించింది.
అర్ నారాయణమూర్తి ప్రయత్నం వల్లే ఇది ఫలించింది అనే టాక్ నడుస్తోంది. ఆయన ఏ గ్రూప్ లో భాగం కాదు. ఆయన పరిశ్రమ బాగు కోసమే అడిగారు. కాబట్టి వెంటనే ఏపీ గవర్నమెంట్ స్పందించినట్లు కనిపిస్తోంది. మరి టికెట్ రేట్ల విషయంలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా అనేది చూడాలి.
జనవరి 7న విడుదల కానున్న ‘ఆర్ ఆర్ ఆర్’, జనవరి 14న వస్తోన్న ‘రాధేశ్యామ్’ చిత్రాలకి ఇప్పుడు అదే టెన్షన్ ఉంది.