
ఆంధ్రప్రదేశ్ లో ఇక సినిమా టికెట్ లను రైల్వే టికెట్లు తరహాలో అమ్ముతారు. ఆ మేరకు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్‌ను తయారు చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో టికెట్ ధరలను తగ్గిస్తూ జీవో జారీ చేసింది. అన్ని ఏరియాల్లో ధరలను తగ్గించింది.
ఈ తగ్గించిన రేట్లు తమకు గిట్టుబాటు కావని ఎగ్జిబిటర్లు ఆందోళన పడుతున్నారు. దాంతో మెగాస్టార్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు కొందరు వెళ్లి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడాలనుకున్నారు. కానీ, ఈ లోపే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. టికెట్ ధరల విషయంలో పారదర్శకతను తెచ్చేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని పర్యవేక్షిస్తుందట.
ఇప్పటికే “బుక్ మై షో” వంటి బుకింగ్ సైట్లు ఉన్నాయి. అలాగే, మల్టిప్లెక్స్ లు స్వయంగా ఆన్లైన్ లో టికెట్స్ అమ్ముతున్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు సొంతంగా ఒక వెబ్ సైట్ తెస్తోంది. ఆన్ లైన్ బుకింగ్ వల్ల జనాలకు నష్టం ఏమి ఉండదు. కానీ, వచ్చిన కలెక్షన్లను ప్రభుత్వం ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తుంది అనే విషయం చూడాలి.
పారదర్శకత వస్తే మంచిదే కానీ ఆ పేరు చెప్పి థియేటర్లపై ప్రభుత్వ పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దగా రెవెన్యూ, టాక్సులు రావడం లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఆయన టికెట్ రేట్ల విషయంలో పట్టుదలగా ఉన్నారట.