
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా సింగర్స్ గా మారిన విషయం తెలిసిందే. ఈ చిన్నారులు ఆలపించిన మొదటి పాట ఆదివారం విడుదలైంది.
తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో వీరు పాట పాడారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగే పాటను అనూప్ రూబెన్స్ స్వరపరిచగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘ఇదే స్నేహం…’ అంటూ సాగే ఈ పాట వీడియోని చూసి గర్వంగా ఉందని మోహన్ బాబు అన్నారు.
మోహన్ బాబు కొడుకులు, కూతుళ్లు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మూడో తరం కూడా రెడీ అయింది. ఐతే, నటులుగా కాకుండా గాయకులుగా పరిచయం కావడం విశేషం.
విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జిన్నా’ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.