విశ్వక్ పరువు తీసిన అర్జున్

Vishwak Sen


విశ్వక్ సేన్ తన సినిమాల పబ్లిసిటీ కోసం అతి చేస్తాడని మొదటి నుంచి పేరు ఉంది. ఐతే, అదంతా సినిమా ప్రచారం కోసం కాబట్టి దాన్ని ఎవరూ పెద్దగా తప్పు పట్టలేదు. థియేటర్లకు జనాలని రప్పించేందుకు ఎన్నో తిప్పలు పడాలి కదా.

ఐతే, హీరోగా విశ్వక్ సేన్ ఏ మాత్రం క్రమశిక్షణ, నిబద్దత లేని నటుడు అని ఘాటుగా ఒక సీనియర్ హీరో విమర్శలు చెయ్యడం అతనికి పెద్ద డ్యామేజీ.

‘ఒక్కడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన అర్జున్ …తన కుమార్తె ఐశ్వర్యని తెలుగు తెరకి పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో విశ్వక్ సేన్ ని హీరోగా తీసుకొని సినిమాని లాంచ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి క్లాప్ కొట్టారు.

షూటింగ్ కి రాకుండా ఎప్పటికప్పుడు ఎగ్గొట్టడం మొదలు పెట్టాడట విశ్వక్ సేన్. దానికి తోడు, విశ్వక్ సేన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతే, అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి విశ్వక్ సేన్ పై ఘాటుగా కామెంట్స్ చేశారు.

“పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తే… షూటింగ్ కు ముందు రోజు రాలేనని మెసేజ్ చేశాడు విశ్వక్ సేన్. కొన్ని రోజులు ఎదురు చూశాం. తర్వాత అర్థమైంది అతనికి వచ్చే ఉద్దేశం లేదని. నా జీవితంలో అతనికి చేసినన్ని కాల్స్, మెసేజిలు ఎవరికీ చెయ్యలేదు. అవన్నీ రికార్డింగ్స్ నా ఫోన్ లో ఉన్నాయి. ఏ మాత్రం కమిట్ మెంట్ లేని నటుడు. బాధ్యత ఇసుమంత కూడా లేదు,” అని విమర్శించారు అర్జున్.

” ఇకపై విశ్వక్ తో వర్క్ చేయను. అలాంటి వాళ్ళతో పని చెయ్యలేం. సినిమా ఇండస్ట్రీలో నిబద్ధతలేని, క్రమశిక్షణ లేని హీరో ఎదగడు,” అని అర్జున్ తెగేసి చెప్పారు.

విశ్వక్ సేన్ ఇటీవల నటించిన ‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. అలాగే, ‘మాస్ కా దాస్’ అనే సినిమాని ఒక దర్శకుడితో సినిమాని లాంచ్ చేసి రెండు రోజులకే దర్శకుడిని తీసేసి తానే డైరెక్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు విశ్వక్ సేన్.

Advertisement
 

More

Related Stories