
తమిళ హీరో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో ‘నిన్నిలా నిన్నిలా”, “అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం” వంటి చిత్రాలు చేశాడు. ఇక తమిళ్ లో “ఓ మై కడువలె” (తెలుగులో “ఓరి దేవుడా”గా రీమేక్ అయింది), “మన్మధ లీలై”, “నితమ్ ఓరు వానం” వంటి చిత్రాల్లో నటించాడు.
ఈ 33 ఏళ్ళ హీరో ఓ ఇంటివాడయ్యాడు ఇప్పుడు. తమిళ హీరోయిన్ కీర్తి పాండియన్ ని పెళ్లాడాడు. వీరి విహహం ఈ రోజు (సెప్టెంబర్ 13) తమిళనాడులో తిరునల్వేలి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో జరిగింది.
పేరున్న హీరో తన ప్రియురాలుని పొలాల మధ్య పెళ్లి చేసుకోవడం విశేషం. హీరోయిన్ కీర్తి కి చెందిన పొలంలో ప్రత్యేకంగా పెళ్లి మండపం వేసి వివాహ వేడుకను నిర్వహించారు.
కీర్తి పాండియన్ చెల్లెలు రమ్య పాండియన్ కూడా నటినే. కీర్తి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది ఇప్పటివరకు. ఐతే, “బ్లూ స్టార్” అనే సినిమాలో కీర్తి, అశోక్ కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.