దర్శకుడు అట్లీ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. “జవాన్” సినిమా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ అందుకొంది. కొత్త రికార్డులు నెలకొల్పింది. అట్లీకిది మొదటి బాలీవుడ్ మూవీ కావడం విశేషం.
ఐతే, అట్లీకి దక్షిణాదిలో మంచి పేరుంది “జవాన్”కి ముందు అతను తీసినవి కేవలం నాలుగే చిత్రాలు. ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి. “జవాన్”తో 100 పెర్సెంట్ సక్సెస్ రేట్ ని కొనసాగించాడు.
అట్లీ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. రోబో, నన్బన్ (స్నేహితుడు) చిత్రాలకు శంకర్ వద్ద పని చేసి “రాజా రాణి” చిత్రంతో దర్శకుడిగా మారాడు. నయనతార, ఆర్య నటించిన ఆ సినిమా 2013లో విడుదలై, మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్ కి కథ చెప్పి “తెరి” (తెలుగులో “పోలీస్”గా డబ్ అయింది) తీసి పెద్ద హిట్ అందుకున్నాడు. అదే సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” అని రీమేక్ చేస్తున్నారు.
“తెరి” హిట్ తో విజయ్ కి, అట్లీకి మంచి స్నేహం ఏర్పడింది. దాంతో విజయ్ తోనే వరుసగా మరో రెండు సినిమాలు – “మెర్సెల్” (తెలుగులో “అదిరింది”), “బిగిల్” (తెలుగులో “విజిల్”) తీశాడు. అవి ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి. “విజిల్” హిట్ అయిన తర్వాత షారుక్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు “జవాన్” కథ చెప్పి ఒప్పించాడు అట్లీ.
అలా తీసిన ఐదు చిత్రాలు హిట్ అవ్వడంతో అట్లీ గ్రాఫ్ ఇప్పుడు మరింతగా పెరిగింది.