
హీరోయిన్లు అందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలువురు భామలు పెళ్లి చేసుకోగా మరికొందరు లైన్లో ఉన్నారు. ఇక టాలీవుడ్ లోనేమో బేబీ బూమ్ కనిపిస్తోంది.
ఇటీవలే హీరో శర్వానంద్ తనకి కూతురు పుట్టినట్లు ప్రకటించాడు. శర్వానంద్, ఆయన భార్య రక్షిత తమ చిన్నారి బేబీతో ఫోటో దిగి షేర్ చేశారు. కూతురికి వాళ్ళు లీలాదేవి మైనేని అని పేరు పెట్టారు. గతేడాది జూన్ లో వీరి పెళ్లి జరిగింది. ఏడాది తిరక్కముందే వారి ఇంట్లో చిన్నారి అడుగుపెట్టింది.
హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఆయన భార్య డాక్టర్ పల్లవికి కొడుకు కలిగాడు. వీరు కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు. గత నెలలో ఆయన భార్య బాబుకి జన్మనిచ్చింది.
ఇక హీరో రామ్ చరణ్ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత తండ్రి అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన గతేడాది అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ చిన్నారికి క్లింకార అనే పేరు పెట్టారు. ఇలా ముగ్గురు టాలీవుడ్ హీరోలు తండ్రులు అయ్యారు గతేడాది కాలంలో.