బేబి – తెలుగు రివ్యూ

Baby

ఒకే ఒక్క పాటతో అందర్నీ ఆకర్షించింది. ట్రయిలర్ తో ఇంకాస్త అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్ తో ఇది కల్ట్ మూవీ అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇలా రిలీజ్ టైమ్ నాటికి దశలవారీగా అంచనాలు పెంచుకుంటూపోయింది “బేబి” సినిమా. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఆ అంచనాల్ని అందుకుందా..?

కథ విషయానికి వస్తే…

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) బస్తీ కుర్రాడు. తన ఎదురింట్లో ఉండే వైష్ణవి తనను ప్రేమిస్తుందని తెలుసుకొని ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అలా ఇద్దరూ ప్రేమలో ఉన్న సందర్భంలో వైష్ణవి కాలేజీ లో చేరుతుంది. పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. కాలేజీలో చేరిన కొద్ది రోజులకే విరాజ్ కి ఎట్రాక్ట్ అవుతుంది వైష్ణవి. వైష్ణవి ఆల్రెడీ ప్రేమలో ఉందని తెలియని విరాజ్, ఆమె ముందు తన ప్రేమ ప్రపోజల్ పెడతాడు. మరి ఆనంద్ తో ప్రేమలో ఉన్న వైష్ణవి, విరాజ్ ప్రేమను ఒప్పుకుందా? వైష్ణవినే ప్రాణంగా భావించే ఆనంద్ ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడు? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది ? మిగతా ఇద్దరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనేది బేబి స్టోరీ.

“మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది” ఈ సినిమాకి దర్శకుడు సాయి రాజేష్ ఇచ్చిన కొటేషన్. ఈ కొటేషన్ లోనే కథ మొత్తం దాగుంది. “కలర్ ఫొటో”లాంటి అద్భుతమైన కథనురాసిన ఈ రైటర్ కమ్ దర్శకుడు.. అన్నీ తానై “బేబి” సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు కథ రాయడంతో పాటు, డైరక్షన్ కూడా చేశాడు. ఇంతకుముందు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ సినిమాల్ని డైరక్ట్ చేసిన సాయిరాజేష్ ఈ సినిమాలో యూత్ ఎలిమెంట్స్ ని కొంచెం కొత్తగా, కొంచెం బోల్డ్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాలో కథ ముఖ్యంగా మూడు పాత్రల మధ్య తిరుగుతుంది. నిజాయితీగా ఉండే ఆటోడ్రైవర్, చాలా ఆశలతో పాటు అంతే కన్ఫ్యూజన్ తో ఉండే ఓ మిడిల్-క్లాస్ అమ్మాయి, స్టీరియోటైపులో ఉండే ఓ రిచ్ కిడ్.. ఈ ముగ్గురి మధ్య నడిచే ఈ సినిమాను ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కాకుండా.. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి, కథకు కొత్తదనం తీసుకొచ్చాడు దర్శకుడు. అలాగే సినిమాని హీరో ఆనంద్ దేవరకొండ పాయింట్ అఫ్ వ్యూలో మొదలుపెట్టాడు. పాత్రల్ని, వాటి స్వభావాల్ని పరిచయం చేస్తూనే, కథను ముందుకుతీసుకెళ్లాడు. అక్కడక్కడ క్యారెక్టరైజేషన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ, తను చెప్పాలనుకున్న పాయింట్ ను, ఇంటర్వెల్ కు వచ్చేసరికి క్లియర్ కట్ గా చెప్పాడు దర్శకుడు. ఇదే బేబికి ప్లస్ పాయింట్.

మరి ఇంటర్వెల్ తర్వాత ఆ పాజిటివ్ ఫీల్ కొనసాగిందా? ఈ ప్రశ్నకు మిక్స్ డ్ రెస్పాన్స్ తప్పదు. ఎందుకంటే, ఇంటర్వెల్ తర్వాత దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. కొన్ని సన్నివేశాల్ని అదే పనిగా కొనసాగించాడు. దీంతో రన్ టైమ్ ఎక్కువై, ప్రేక్షకుడి కోర్ ఫీలింగ్ ను దెబ్బతీసింది. సినిమా ఎమోషనల్ గా సాగుతున్నప్పటికీ, లెంగ్తీ రన్ టైమ్ వల్ల ప్రేక్షకుడు ఇబ్బంది పడకతప్పని పరిస్థితి. దీనికితోడు సినిమాకు ఇచ్చిన ముగింపు కూడా పూర్తిగా మెప్పించదు.

హీరోయిన్ చుట్టూ తిరిగే ఈ కథకు పూర్తి న్యాయం చేసింది వైష్ణవి చైతన్య. మొదట్లో పేదింటి అమ్మాయిగా, ఆ తర్వాత ట్రెండీ గాళ్ గా ఆమె బాడీ లాంగ్వేజ్ లో తేడా చూపించగలిగింది. మేకప్ కూడా మార్చడం ఆమె పాత్రకు మరింత కలిసొచ్చింది. కొన్ని సందర్భాల్లో కళ్లతోనే ఆమె భావాలు పలికించిన తీరు బాగుంది. ఇక ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో ఒక మెట్టు ఎక్కినట్లే. అతడి నటన అత్యంత సహజంగా, సింపుల్ గా ఉంది. ఎక్కడా ఓవర్ అనిపించకపోవడమే అతడికి ప్లస్ అయింది. పైగా అతడి ఫిజిక్ కూడా ఆ పాత్రకు భలేగా కలిసొచ్చింది. కొన్ని సీన్స్ లో అద్భుతంగా చేశాడు ఆనంద్. సినిమా ఎండింగ్ కు వచ్చేసరికి ఆనంద్ పాత్రే హైలెట్ అవుతుంది. విరాజ్ అశ్విన్ పాత్ర రొటీన్ గానే కనిపించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో నటించడానికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. విరాజ్ తన పాత్ర ఫరిది మేరకు బాగానే చేశాడు.

టెక్నికల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా విజయ్ బుల్గానిన్ గురించే మాట్లాడుకోవాలి. అతడి సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. ‘ఓ రెండు మేఘాలిలా’, ‘ప్రేమిస్తున్నా’ పాటలు ఆడియోగానే కాకుండా, వీడియో పరంగా కూడా ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంత పెద్ద రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను చూడగలిగామంటే, దానికి కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలే. దీనికితోడు బాల్ రెడ్డి కెమెరావర్క్ కుదిరింది. విప్లవ్ ఎడిటింగ్ పై మాత్రం విమర్శలు తప్పవు. రన్ టైమ్ ఇంకాస్త తగ్గించొచ్చు.

దర్శకుడి విషయానికొస్తే.. రచయితగా సాయిరాజేష్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. కలర్ ఫొటో రేంజ్ లో క్లయిమాక్స్ రాసుకోలేకపోయాడు కానీ, బేబి ముగింపు కూడా తీసిపారేసేదేం కాదు. లవ్ సీన్స్ ను సాయిరాజేష్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కొన్ని చోట్ల కవితాత్మకంగా చెబుతూనే, మరికొన్ని చోట్ల యూత్ అప్పీలింగ్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాలతో కొంతమంది కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. బోల్డ్ గా డైలాగ్స్ చెప్పించే ప్రయత్నంలో కొన్నిసార్లు పరిధి దాటారు.

ఓవరాల్ గా “బేబి” సినిమా ఈతరం ప్రేమల్ని ప్రతిబింబిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. “బేబి” సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. ఐతే, ద్వితీయార్థంలో కొంత కన్ఫ్యూజన్ కనిపించింది. అలాగే లెంగ్తీ రన్ టైమ్ ను మాత్రం క్షమించలేం. ఇవి పక్కనపెడితే, సినిమాను ఓసారి చూడొచ్చు.

బాటమ్ లైన్: బోల్డ్ బేబి

Rating: 2.75/5

By M Patnaik

Advertisement
 

More

Related Stories