
నందమూరి బాలకృష్ణకి తారకరత్నకు ఉన్న అనుబంధం ఎలాంటిదో తారకరత్న కుప్పంలో కుప్పకూలిన తర్వాత చూశాం. తారకరత్నని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర్నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్ హాస్పిటల్ కి తరలించడం వరకు బాలయ్యే దగ్గరుండి చూసుకున్నారు. ఇక బెంగుళూరు ఆసుపత్రిలోనే రోజుల తరబడి ఉండి తారకరత్నని కాపాడేందుకు బాలయ్య తన ప్రయత్నం మొత్తం చేశారు.
ఐతే, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తాజాగా బాలయ్య గొప్పదనం గురించి ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆయనే మాకు అండా దండా అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఇన్ స్టాగ్రామ్ లో. ఇది ఇప్పుడు బాగా వైరల్ అయింది.
తారకరత్న తల్లిదండ్రులు మాత్రం ఆమెని తమ కోడలిగా స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు. తారకరత్న, అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ కి సమీపంలోని మోకిల్లాలో వేరుగా కాపురం పెట్టారు. కానీ తారకరత్న తల్లితండ్రులు మాత్రం అలేఖ్యని కోడలిగా గుర్తించలేదు. తారకరత్న మరణం తర్వాత కూడా ఏ మార్పు లేదు. దాంతో, తారకరత్న బాబాయిగా బాలయ్య అలేఖ్యకి, ఆమె పిల్లలకు దన్నుగా ఉంటున్నారు.
“ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలయ్య తారకరత్నకి తండ్రిలా సేవలు చేశారు. తల్లిలా పాటలు పాడారు. ఆయన ప్రతిస్పందించాలి అనే ఉద్దేశంతో జోకులు వేసేవారు. ఎవరూ చూడని సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఆయన అన్ని వేళలా మా వెంటే ఉన్నారు,” అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.