
త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్షులుగా పోటీ చేసున్నారు. వీరి ప్యానెల్స్ తో సంబంధం లేకుండా తానే స్వతంత్రంగా బరిలో దిగారు బండ్ల గణేష్. ఆయన జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగతా పదవులకు పోటీలో ఉన్నవారిలో ఎవరికీ ఓటు వేసినా ఫర్వాలేదు జనరల్ సెక్రటరీగా మాత్రం తననే గెలిపించండి అని వేడుకుంటున్నారు ఈ కమెడియన్ కమ్ నిర్మాత.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఏకంగా తన ఇంట్లో పూజలు కూడా చేయించుకున్నారు ఆయన. “సహస్ర లింగార్చన పూజ నా గృహమునందు ఇప్పుడే పూర్తి చేసుకున్నాను,” అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేశారు బండ్ల గణేష్.
బండ్ల గణేష్ ఈ పదవిని, ఈ ఎన్నికలను ఎందుకింత సీరియస్ గా తీసుకున్నారో అర్థం కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వర్గం ప్రకాష్ రాజ్ టీంకి మద్దతు ఇస్తున్నారనేది ఇండస్ట్రీలో అందరికి తెలుసు. 950 మంది సభ్యులున్న ‘మా’లో 400 నుంచి 500 మంది మాత్రమే ఓటు వేస్తారు. అందులో కొంతమంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి, మరికొందరు విష్ణు ప్యానెల్ కి మద్దతిస్తారు.
మరి ఇండిపెండెంట్ గా నిలిచిన గణేష్ కి అవకాశాలు ఎలా ఉంటాయో? బండ్ల గణేష్ తనకి మద్దతు ఇస్తున్న వారి సంఖ్య పెద్దదే అని అంటున్నారు. నిజంగా అతనికి అంత సీన్ ఉందా అన్నది చూడాలి.