
GHMC ఎన్నికలు ముగిశాయి. దాంతో నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు నోరు విప్పాడు. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు మాట్లాడుతున్నాడు బండ్ల. ఎన్నికల టైంలో స్పందిస్తే రాజకీయం అనుకుంటారని సైలెంట్ గా ఉన్నాడట. “నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష. నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది,” అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.
“ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి. రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం,” అంటూ సుదీర్ఘ ట్వీట్లు గుప్పించాడు బండ్ల గణేష్.
పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” సినిమాను నిర్మించాడు. మళ్ళీ, మరో సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు.
అంతా బాగానే ఉంది కానీ… మరి తన దైవం పెట్టిన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో ఎందుకు చేరారు అన్న ప్రశ్నకు బండ్ల నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు.