‘భగవంత్ కేసరి’కి మరింత ప్రమోషన్

- Advertisement -
Bhagavanth Kesari

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన “భగవంత్ కేసరి” సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకొంది. ఈ సినిమాకి మొదటి వారం వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే ఇంకో వారం ఆడితే కానీ లాభాల బాట పట్టదు. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లు బాగున్నాయి. కానీ, ఇంకో వారం ఆడితేనే డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాలు చూస్తారు.

మొదటి వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో ఈ సినిమాకి మరింత పబ్లిసిటీ కల్పించేందుకు టీం అంతా ఇప్పుడు టూర్లు మొదలుపెట్టింది. శుక్రవారం వైజాగ్ లో ఈ టూరు మొదలు. రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప మీదుగా ఈ టూర్ సాగుతుంది.

బాలయ్య రెగ్యులర్ చిత్రాలకు ఇది కొంత భిన్నం. ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరణతో ముందుకు సాగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన శైలికి భిన్నంగా ఎటువంటి కామెడీ ట్రాకులు, గ్లామర్ షోతో కూడిన డ్యూయెట్లు లేకుండా తీశాడు. ఇలాంటి సినిమాలకు మరింత ప్రమోషన్, పబ్లిసిటీ అవసరం. అందుకే రెండో వారం కూడా సినిమాని థియేటర్లలో బలంగా నిలిపేలా టీం కష్టపడుతోంది.

ఇక అమెరికాలో ఈ సినిమా హిట్ అయింది. బాలయ్య కెరీర్ లో ఎక్కువ వసూళ్లు అందుకున్న చిత్రాల్లో  దీనిది రెండో స్థానం. “అఖండ”, “వీర సింహారెడ్డి” చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు అందుకొంది. రెండో వీకెండ్ కూడా బాగానే ఆడే అవకాశం ఉంది.

 

More

Related Stories