
‘అయ్యప్పనమ్ కోషియమ్’ అనే మలయాళ చిత్రం ఆధారంగా ‘భీమ్లా నాయక్’ని తీశారు అని కొత్తగా చెప్పకర్లేదు. ఐతే, ఈ సినిమా కథని పూర్తిగా మార్చినట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది. తాజాగా విడుదలైన ట్రయిలర్ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది.
భీమ్లా నాయక్ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పవన్ కళ్యాణ్, డేనియల్ శేఖర్ అనే యువకుడిగా రానా నటించారు. మలయాళంలో ఇవే పాత్రలు. కథ కూడ వీరిద్దరి మధ్య జరిగే అహంభావ రగడ (ఈగో క్లాష్). ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ లో కూడా అదే చూపించారు. అందుకే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించుకున్న ‘హంగామా’ ట్రైలర్ లో కనిపించలేదు. దీనివల్ల కొంత నిరాశపడ్డారు.
కథ మార్చలేదు కానీ కథనంలో చాలా మార్పులు కనిపిస్తాయట. మలయాళ చిత్రం మూడు గంటల నిడివి ఉన్నది. తెలుగులో పాటలతో కలిపి 2 గంటల 24 నిమిషాలే. దాదాపు అరంగంట తక్కువ నిడివి. మలయాళంలో స్లోగా సాగే సన్నివేశాలు, కథకి అడ్డంకిగా నిలిచిన ఎపిసోడ్ లని తీసేసి తెలుగులో మరింత రేసిగా మలిచారట.
త్రివిక్రమ్ మార్కు డైలాగులు మరో ఆకర్షణగా నిలుస్తాయి. ట్రైలర్ అంతగా ఉత్తేజపర్చకపోయినా సినిమా నిరాశపర్చదు అని ఇన్సైడ్ టాక్.