భీమ్లానాయక్ – మూవీ రివ్యూ

Bheemla Nayak

రీమేక్ ను ఉన్నది ఉన్నట్టుగా తీస్తే కాపీ-పేస్ట్ అంటారు. మార్పుచేర్పులు చేస్తే చెడగొట్టారని విమర్శిస్తారు. మరి ఓ పెద్ద హీరోతో సక్సెస్ ఫుల్ రీమేక్ ను ఎలా తీయాలి? ఈ ప్రశ్నకు తాజా సమాధానం “భీమ్లానాయక్”. వాస్తవికంగా తెరకెక్కిన ఓ మలయాళం సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూనే పూర్తిగా ఫీల్ చెడకుండా బ్యాలెన్స్ చేశారు.

రియల్ లైఫ్ లో పవన్ కల్యాణ్ కు ఎంత టెంపర్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయనలో ఉన్న ఆ ఒరిజినాలిటీని భీమ్లానాయక్ కోసం పెర్ ఫెక్ట్ గా వాడుకున్నారు. ఇగోను టచ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తాననే భీమ్లానాయక్ పాత్రలో పవన్ పెర్ఫార్మెన్స్ నప్పింది. ఇది మలయాళం రీమేక్ అయినప్పటికీ, సినిమా చూస్తే పవన్ కల్యాణ్ అసలైన వ్యక్తిత్వం భీమ్లానాయక్ లో కనిపిస్తుంది. అదే ఈ సినిమాను రీమేక్ అనే ఫీలింగ్ రాకుండా చేసింది.

అయ్యప్పనుమ్ కోషియమ్ లో కథ ఏదైతే ఉందో, ఇందులో కూడా కథను అలానే ఉంచారు. ఇంకా చెప్పాలంటే ప్రారంభ సన్నివేశాలన్నీ మక్కికిమక్కి దించేశారు కూడా. కానీ పవన్ కల్యాణ్, రానాను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టరైజేషన్స్ లో చిన్న చిన్న మార్పులు చేశారు. దీనికి తోడు కథనలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జోడించడంతో పాటు.. ఆ ఫ్లాష్ బ్యాక్ ను క్లైమాక్స్ కు లింక్ చేయడం భీమ్లానాయక్ లో చేసిన ప్రధానమైన మార్పు. ఈ మార్పులు సినిమాలో మెప్పిస్తాయి.

ఈ కథలో ఎవ్వరూ హీరో కాదు, అలా అని విలన్లు కూడా కాదు. భీమ్లానాయక్ హీరోనే. కానీ అతడికి కూడా కొన్ని బలహీనతలుంటాయి. ఆవేశాన్ని ఆపుకోలేడు. కోపాన్ని నియంత్రించుకోలేడు. ఇటు డేనియల్ శేఖర్ కూడా చెడ్డవాడు కాదు. కేవలం పరిస్థితుల కారణంగా వీళ్లిద్దరి ఇగోలు హర్ట్ అవుతాయి. స్వతహాగా వచ్చిన స్వభావం కారణంగా దాన్ని తెగేదాకా తీసుకెళ్తారు ఇద్దరూ. కారులో మద్యం బాటిళ్లు దొరుకుతాయి. అది చిన్న కేసు, కావాలంటే కేసు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ డానియల్ కు అవమానం ఎదురవుతుంది. అందుకే అతడు పోలీసులపై తిరగబడతాడు. ఆ పరిస్థితుల్లో భీమ్లానాయక్ కూడా ఏం చేయలేడు. ఓ పోలీస్ లా మాత్రమే వ్యవహరిస్తాడు. అక్కడితో వ్యవహారం ఆగదు. భీమ్లానాయక్ తనకు మందుపోస్తున్న వీడియోను డానియల్ షూట్ చేసి వైరల్ చేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మరింత పెరుగుతుంది. ఇలా పరిస్థితులు ఇద్దర్నీ శత్రువులుగా మార్చేస్తాయి తప్ప, ఇద్దరూ చెడ్డవాళ్లు కాదు. ఈ స్క్రిప్ట్ లోనే ఓ రకమైన అందం ఉంది. దాన్ని ఒడిసిపట్టుకొని తన డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో మాస్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్.

మలయాళంలో కూడా ఇది కమర్షియల్ సినిమానే. కానీ అక్కడి మేకర్స్ మరింత కమర్షియల్ హంగుల్ని చూపించలేకపోయారు. పాత్రకు తగ్గట్టు బిజు మీనన్ చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటాడు. కానీ భీమ్లానాయక్ లో పవన్ ను అలా చూపించడం కుదరదు. అందుకే ఇగోతో పాటు చిన్న టెంపర్ ను యాడ్ చేశారు. ఇంటర్వెల్ లో పవన్ కల్యాణ్ బస్సులో చెప్పిన డైలాగ్స్ దీనికి ఉదాహరణ. అలా అని కమర్షియాలిటీ కోసం ఐటెంసాంగ్స్, యుగళ గీతాలు పెట్టకపోవడం చాలా మంచి పని. టైటిల్ సాంగ్ తప్ప అన్నీ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతాయి.

రెండు బలమైన పాత్రల మధ్య ఘర్షణను చూపించే సినిమా కాబట్టి ఆ రెండు పాత్రల పెర్ఫార్మెన్స్ ఎక్కడా తగ్గకూడదు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ తన సీనియారిటీ మొత్తం చూపించారు. భీమ్లానాయక్ గా పవన్ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. అతడి నిజజీవిత వ్యక్తిత్వానికి ఈ పాత్ర సరిగ్గా సరిపోయింది. లాడ్జ్ ఫైట్, క్లైమాక్స్ లో పవన్ మెరుపులు చూడొచ్చు. ఇక రానా డానియల్ గా చాలా కాలం తర్వాత మంచి నటన చూపించాడు. కెరీర్ పరంగా రానా పోషించిన బెస్ట్ రోల్స్ లో డాని ఒకటి.

నిత్యామీనన్ కు నటించడానికి 2 సీన్లు మినహా ఎక్కువ స్కోప్ దక్కలేదు. సంయుక్త మీనన్ పాత్ర మెరిసింది. మలయాళంలో లేని స్కోప్ ఆమెకు తెలుగులో దక్కింది. దానికి కారణం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ పార్ట్. మురళీ శర్మ, సముత్తర ఖని, రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రావురమేష్ పాత్రను మధ్యలో వదిలేసినట్టు అనిపిస్తుంది.

తెరపై నటీనటులు తమ పనితనం చూపిస్తే, తెరవెనక తమన్ తన టాలెంట్ చూపించాడు. తమన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మేజర్ ఎస్సెట్. ఫస్టాఫ్ లో వచ్చిన కొన్ని సాధారణమైన సన్నివేశాల్ని సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు ఈ సంగీత దర్శకుడు. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ మరో హైలెట్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పవన్ పాత్రను మార్చడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టడం, దానికి క్లైమాక్స్ కు లింక్ ఇవ్వడం లాంటి అంశాల్లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక డైలాగ్స్ పరంగా చూసుకుంటే.. పీకేస్తే లేస్తా, పాతేస్తే మొలుస్తా.. తప్పు తెలుసుకోవడం, తప్పుకోవడం లాంటి డైలాగ్స్ మెప్పిస్తాయి. దర్శకుడు సాగర్ చంద్ర ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించడంలో తన పనితనం చూపించాడు.

ఓవరాల్ గా ఒరిజినల్ వెర్షన్ తో పోలిక పెట్టకుండా చూస్తే.. ఆత్మగౌరవానికి, గర్వానికి మధ్య జరిగిన భీమ్లా-డానియల్ పోరును ఆస్వాదించొచ్చు.

Rating: 3/5

By: పంచ్ పట్నాయక్

Advertisement
 

More

Related Stories