
“గుర్తు పెట్టుకొండి… ఈసారి కూడా మిస్ అవదు. జనవరి 12, 2022న థియేటర్లలో కలుద్దాం.”
ఇది ‘భీమ్లా నాయక్’ నిర్మాత నాగవంశీ ఆదివారం (నవంబర్ 21) నాడు వేసిన ట్వీట్. “జనవరి 12న వస్తున్నాం” అని భీమ్లా నాయక్ మేకర్స్ ఊదరగొడుతున్నా ఈ సినిమా వాయిదాపడక తప్పదు అనే మాట ఫిలిం నగర్ వీధుల్లో వినిపిస్తోంది. ఎందుకంటే, ఆ తేదీన ఈ సినిమా విడుదలైతే, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన రాజమౌళి చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’కి ఇబ్బంది అవుతుంది.
‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7న విడుదల కానుంది. ఒకవేళ ‘భీమ్లా నాయక్’ జనవరి 12న వస్తే ఆరో రోజే “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి థియేటర్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత రెండు రోజులకు “రాధేశ్యామ్” విడుదల కానుంది. అప్పుడు మరిన్ని థియేటర్లను “ఆర్ ఆర్ ఆర్”కి కోత వేస్తారు. మొదటివారంలోనే “మొత్తం వసూళ్లు” రాజమౌళి సినిమా సాధించడం కష్టం. ఎందుకంటే భారీ మొత్తానికి ఈ సినిమాని అమ్మారు.
ఇవన్నీ ఆలోచించే “ఆర్ ఆర్ ఆర్” టీం ఇప్పుడు టెన్షన్ పడుతోంది. మొదట రాజమౌళి టీం ఎక్కువ ధీమాగా ఉంది. మనం రంగంలోకి దిగితే మిగతావాళ్లే భయపడి తప్పుకుంటారు అని అనుకొంది. ఇక్కడ ఎవరూ భయపడరు… అని తర్వాత అర్థం అయింది. అందుకే… “భీమ్లా నాయక్” డేట్ జనవరి 12 అని వారానికోసారి ప్రకటన ఇస్తున్న కొద్దీ రాజమౌళి టీంకి గుండెదడ పెరుగుతోంది.
మొదట రాజమౌళి టీం నుంచి ఎవరూ పవన్ కళ్యాణ్ ని కలిసి మాటలాడలేదు. రామ్ చరణ్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు, తప్పక రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగుతున్నారని టాక్. పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమాని వాయిదా వేసుకోమని కోరుతారని గుసగుస. రాజమౌళి, రామ్ చరణ్ అడిగితే పవన్ కళ్యాణ్ కాదనలేరు. అందుకే, “భీమ్లా నాయక్” విడుదల తేదీపై ఇప్పుడు పక్కాగా చెప్పలేం.
రాజమౌళి ఏకపక్షంగా జనవరి 7 అని డేట్ ప్రకటించి సమస్యని జఠిలం చేశారు. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్నారు కాబట్టి ముందే ఆయన ముల్లె సర్దుకొని సంక్రాంతి బారి నుంచి బయటపడ్డారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు మాత్రం తమ పద్దతిలోనే వెళుతున్నారు. సో… ఫైనల్ గా రాజమౌళే దిగి రాక తప్పలేదు అనిపిస్తోంది. ఒకవేళ, రాజమౌళి నిజంగా పవన్ కళ్యాణ్ ని కోరితే… రకరకాల కామెంట్స్ వస్తాయి. కానీ కామెంట్స్ కన్నా కలెక్షన్లు ముఖ్యం కదా!