మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అనిల్ శంకర్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు మూడు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. “భోళా శంకర్” సినిమాకి సంబంధించిన పారితోషికంలో భాగంగా తనకి రావాల్సిన 5 కోట్ల బకాయిలను నిర్మాత నుంచి చిరంజీవి ముక్కుపిండి వసూల్ చేశారని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.
తాజాగా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ వార్తలపై స్పందించింది.
“గొడవలు జరుగుతున్నాయి అని సాగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. నిరాధారం. లేశమాత్రం నిజం లేదు. దయచేసి ఇలాంటి పుకార్లని నమ్మొద్దు, ప్రచారం చేయొద్దు,” అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
“భోళా శంకర్” సినిమాని అనిల్ సుంకరకి చెందిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా దారుణ పరాజయం పాలైంది. మొదటి రోజు మొదటి ఆటతోనే దాని ఫలితం తేలిపోయింది. దాదాపు 70 కోట్ల నష్టం వచ్చింది అని అంచనా.
ఐతే, సినిమా విడుదలనాడే చిరంజీవి నిర్మాతని పిలిచి సూర్యాపేట సమీపంలోని పది ఎకరాల తోటని తన పేరు మీద రాయించుకున్నారు అని కొన్ని వెబ్ సైట్స్ రాశాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.