భోళా శంకర్ – తెలుగు రివ్యూ

Bholaa Shankar

“మీరు సినిమా తీసి చాలా కాలమైంది. సత్యానంద్ కథా పర్యవేక్షణ అంటున్నారు. ఆయన కూడా చాలా జనరేషన్స్ దాటేశారు. ఇప్పటి తరం పల్స్ కు తగ్గట్టు సినిమా ఉంటుందా?” భోళాశంకర్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మెహర్ రమేష్ కు ఎదురైన బేసిక్ క్వశ్చన్ ఇది. దీనికి ఆయన ఎంత సమర్థవంతంగానైనా సమాధానం ఇచ్చుకోవచ్చు కానీ, ఆ ప్రశ్నే అనుమానమైంది, ఆ తర్వాత పెనుభూతంగా మారింది. ఇప్పుడు థియేటర్లలో అదే నిజమైంది.

ఈ కథ తనకు బాగా నచ్చిందన్నారు చిరంజీవి. పైగా ఓటీటీలో ఎక్కడా లేదు కాబట్టి, ఎవ్వరూ చూసి ఉండరు కాబట్టి చేశానని చెప్పుకొచ్చారు. నిజంగా కథ నచ్చి చిరంజీవి చేశారా లేక ఓటీటీలో ఎవ్వరూ చూడలేదు కాబట్టి చేశారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇది క్రీస్తుపూర్వం కాలానికి చెందిన కథ. ఇప్పటి తరానికి అస్సలు సెట్ కాని కథ. కాబట్టి ఓటీటీలో ఎవ్వరూ చూడలేదనే ధైర్యంతోనే చిరంజీవి, ఈ రిస్క్ చేసినట్టు కనిపిస్తోంది. ఇవేవీ కాదనుకుంటే.. ఎప్పట్నుంచో తన వెంట తిరుగుతున్నతన బంధువు మెహర్ రమేష్ కు ఓ అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా చేసినట్టు కనిపిస్తోంది.

శంకర్ (చిరంజీవి), మహా (కీర్తి సురేష్) హైదరాబాద్ నుండి కోల్‌కతా రావడంతో సినిమా ప్రారంభమౌతుంది. మహా మంచి పెయింటర్. శంకర్ ఆమెను కోల్‌కతాలోని ఒక ప్రతిష్టాత్మక ఆర్ట్ స్కూల్‌లో చేర్పిస్తాడు. శంకర్ టాక్సీ డ్రైవర్ అవుతాడు. మరోవైపు, కోల్‌కతా పోలీసులు, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ముఠా కోసం క్యాబ్ డ్రైవర్ల సహాయం కోరుతుంది. మరోవైపు, శంకర్, లాస్య (తమన్నా) అనే లాయర్‌ని అనుకోకుండా కలుస్తాడు. లాస్య సోదరుడు (సుశాంత్) మహాతో ప్రేమలో పడతాడు. ఓవైపు కథ ఇలా నడుస్తుండగా, మరోవైపు యువతుల కిడ్నాపర్ల గ్యాంగ్ ను శంకర్ హతమారుస్తుంటాడు. శంకర్ హంతకుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. మహాలక్ష్మితో కలిసి కోల్ కతా ఎందుకు వచ్చాడు.. హైదరాబాద్ లో భోళాగా ఉన్న వ్యక్తి, శంకర్ గా ఎలా మారాడు.. అనేది బ్యాలెన్స్ స్టోరీ.

కథ స్టార్ట్ చేయడమే రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. చిరంజీవి పట్ల అంతా ఆరాధనాభావంతో ఉండడం కనిపిస్తుంది. అంతలోనే వెన్నెల కిషోర్ ఎంట్రీ. ఆ కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుందని ఆశించిన ఆడియన్స్ కు తాము అనవసరంగా ఆశపడ్డామనే విషయం 10 నిమిషాలకే అర్థమైపోతుంది. బ్రహ్మానందం నుంచి జబర్దస్త్ వరకు కామెడీ ఆర్టిస్టులందర్నీ పెట్టి తీసిన ఈ సినిమాలో మచ్చుకు ఒక్క కామెడీ సీన్ నవ్వించేలా లేకపోవడం బాధాకరం.

ఇది తమిళ చిత్రం “వేదాళం” ఆధారంగా తీసినది. ఆ తమిళ కథ డీసెంట్ గా ఉంటుంది. అప్పటి కాలానికి అది కరెక్ట్. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. చిరంజీవి కోసం చాలా మార్పలు చేశారు. మెహర్ చెప్పినట్టు సగానికి పైగా మార్చేశారు. అన్నీ చిరంజీవి కోసం అతికించిన హంగులే తప్ప, కథను మరింత మెరుగు చేసే ప్రయత్నం మచ్చుకైనా కనిపించలేదు. అక్కడే ఈ సినిమా తేడా కొట్టేసింది. 8 ఏళ్ల నాటి ఈ తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనే మూర్ఖత్వం. ఈ రీమేక్ లో నటించడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారో, నిర్మించడానికి నిర్మాతలు ఎలా అంగీకరించారో ఎంత ఆలోచించినా అర్థం కాదు.

భోళాశంకర్ సాధారణ ప్రేక్షకులనే కాదు మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏదోలా అనిపిస్తుంది. ఎక్కడా కనెక్ట్ అవ్వం. కామెడీ వస్తుంటుంది కానీ నవ్వు రాదు. సెంటిమెంట్ సీన్ వస్తుంది కానీ హార్ట్ కు టచ్ అవ్వదు. ఇక సాంగ్స్ వస్తే చిరంజీవి స్టెప్స్ చూడాలనిపించదు. అదేంటో సినిమా మొత్తం భారంగా నడుస్తుంది.

కథనం, దర్శకత్వం, సంగీతం, డైలాగ్‌లు, ఫైట్లు.. ఇలా ఏవీ ఈ సినిమాలో వర్కవుట్ అవ్వలేదు. ఏవీ పని చేయవు. ఇవన్నీ ఒకెత్తయితే.. “ఖుషి” నడుము సీన్ మరో ప్రహసనం. చిరంజీవి-శ్రీముఖి మధ్య తీసిన ఈ సీన్ చూడ్డానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఫన్ కోసం తీశారా, చిరంజీవి పరువు తీయడానికి తీశారో అర్థం కాదు.

పరిశ్రమలో చిరంజీవి లెజెండ్. అలాంటి హీరోను పెట్టి, ఎదురుగా శ్రీముఖిని కూర్చోబెట్టి ఇలాంటి నాసిరసం సన్నివేశాలు తీయడం ఈ మేకర్స్ కే చెల్లింది. ఇలా కామెడీ కోసం చిరంజీవి చేసిన ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. సీన్ లో దమ్ము లేనప్పుడు చిరంజీవి అయినా ఏం చేస్తారు పాపం. ఇక కీర్తి సురేష్‌తో ఎమోషనల్ సీన్స్ కూడా రొటీన్‌గా ఉన్నాయి. క్లయిమాక్స్ లో కొన్ని సీన్లు మాత్రం వర్కవుట్ అయ్యాయి.

నటనపరంగా చిరంజీవి ఎప్పటిలాగే తనదైన శైలిలో మెప్పించారు. కీర్తి సురేష్ సరైన ఎంపిక. ఆమె బాగా చేసింది. తమన్నా బాగానే ఉంది. ఇతర నటీనటులు కేవలం కనిపిస్తారంతే. జబర్దస్త్ టీమ్ అయితే ఎందుకుందో అర్థంకాదు. మహతి స్వర సాగర్ పాటలు కనెక్ట్ అవ్వవు. దర్శకుడిగా మెహర్ రమేష్ మరోసారి మెప్పించలేకపోయాడు. స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది.

ఓవరాల్ గా “భోళాశంకర్” సినిమాలో కొత్తదనం మచ్చుకు కూడా కనిపించదు. పాత సీక్వెన్సులు, బోర్ కొట్టించే క్షణాలే నిండుగా ఉన్నాయి. చిరంజీవి కోసం చేసిన మార్పుచేర్పులు, కనీసం ఆయన అభిమానుల్ని కూడా అలరించవు.

బాటమ్ లైన్ – ”బోర్లా’ శంకర్

Rating: 2/5

By M Patnaik

Advertisement
 

More

Related Stories