
ఒకప్పటి అగ్ర కథానాయిక భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా బిజీ కాలేకపోయారు. వదిన, అక్క, తల్లి పాత్రల్లోకి వచ్చిన భూమికకు తెలుగులో పెద్ద చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ “ఎంసీఏ” (Middle Class Abbayi) తప్ప మిగతావి ఏవీ పెద్దగా విజయం సాధించలేదు.
ఈ ఏడాది “పాగల్”, “సీటిమార్” చిత్రాల్లో కనిపించారు. కానీ, అవి కూడా ఆమెకి హెల్ప్ కాలేదు. దాంతో, భూమిక కెరీర్ పల్లె వెలుగు బస్సులా సాగుతోంది తప్ప ఎక్స్ ప్రెస్ బస్సులా దూసుకెళ్లడం లేదు. ఆమె ఎక్కువగా ఎవరితో కలవదు. పార్టీలకు వెళ్ళదు. బహుశా అందుకే ఆమెకి ఎక్కువ ఆఫర్లు రావడం లేదా?
“పార్టీలకు వెళ్తే తప్ప మనల్ని గుర్తుపెట్టుకోరు అనే మాటని నేను నమ్మను. ఫిలింమేకర్స్ తో రోజూ టచ్ లో ఉంటేనే అవకాశాలు వస్తాయి అనుకోవడం కూడా భ్రమ. నా కోసమే పాత్రలు రాసి, నా కోసమే ముంబై వరకు వచ్చిన మేకర్స్ ఎందరో ఉన్నారు,” అని భూమిక వివరణ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడింది.
భర్తతో కలిసే ఉన్నాను అని మరోసారి వివరణ ఇచ్చింది. వీరికి ఒక బాబు.

“మేం ఇద్దరం ఒకరి పనిలో మరొకరం జోక్యం చేసుకోము. అందుకే, ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. కానీ మా పర్సనల్ లైఫ్ సాఫీగా సాగిపోతోంది.”