Bigg Boss Telugu 4 – Episode 1 (Recap)

బిగ్ బాస్ సీజన్-4 హంగామా మొదలైంది. 16 మంది కంటెస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరుగా రాత్రి హౌజ్ లోకి చేరుకున్నారు. కేవలం పరిచయం కార్యక్రమాలతోనే ముగుస్తుందనుకున్న తొలి రోజు ఎపిసోడ్ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చింది. ఇంకా హౌజ్ లోకి వెళ్లకముందే లాస్య, కరాటే కల్యాణి, గంగవ్వ లాంటి కంటెస్టెంట్లు ఏడుపు అందుకున్నారు.
తను జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది యాంకర్ లాస్య. 10 రోజుల పాటు భోజనం లేకుండా, చిరు తిండ్లు తిని పస్తులున్న రోజులు కూడా ఉన్నాయంటూ బాధపడింది. బుల్లితెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తానని, కానీ అసలు తానేంటో నిరూపించుకునేందుకు హౌజ్ లోకి వస్తున్నానని చెప్పుకొచ్చింది.
అటు మరో కంటెస్టెంట్ కరాటే కల్యాణి కూడా ఎమోషనల్ అయిపోయింది. తన జీవితంలో ఎదురైన బాధాకరమైన సంఘటనలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటపెట్టింది. తనకు పెళ్లి కలిసి రాలేదని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. వీళ్లతో పాటు యూట్యూబ్ స్టార్ గంగవ్వ కూడా తన కష్టాల్ని చెప్పుకొచ్చింది. తన వద్ద కేవలం 6 చీరలు మాత్రమే ఉన్నాయని, వాటినే పెట్టుకొని హౌజ్ లోకి వస్తున్నానని తెలిపింది.
ఇలా షో ప్రారంభానికి ముందే బిగ్ బాస్ సీజన్-4లో ఏడుపులు మొదలయ్యాయి.