టాలీవుడ్లో బీజేపీ అరిగిపోయిన ఫార్ములా!


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కుదిరితే అధికారంలోకి, కుదరకపోతే బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని పట్టుదలగా ఉంది. అందుకే, ఇప్పుడు సినిమా వాళ్ళపై దృష్టి పెట్టింది. సినిమావాళ్లను, స్పోర్ట్స్ సెలెబ్రిటీలను బీజేపీ పెద్ద నాయకులు పిలవడం, కలవడం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్న ఫార్ములా.

గతంలో తమిళనాడులో రజినీకాంత్ తో ఇలాగే చేశారు. కానీ అది వికటించింది. కేరళలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఇతర నటులను లాగాలని ప్రయత్నించి విఫలమైంది బీజేపీ. ఐతే, తమ అగ్రనాయకత్వంతో రజినీకాంత్, మోహన్ లాల్ చాలా సన్నిహితంగా ఉంటారని ప్రూవ్ చేసింది. బాలీవుడ్ లో ఖాన్ దాదాలు మినహా అమితాబ్ నుంచి దాదాపు అందరిని తమవైపు రప్పించుకున్నారు బీజేపీ అగ్రనేతలు. కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ఆ మధ్య బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ప్రత్యేక విమానం వేసుకోని వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఇక బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ కి మోదీ ట్రంపెట్ (భజనకారుడు) అన్న గుర్తింపు ఉంది.

బెంగాల్ లో సౌరవ్ గంగూలీ సహా పలువురు సెలెబ్రిటీలతో రాసుకుపూసుకు తిరిగారు. అందరూ మా వైపే ఉన్నారు అని చెప్పుకోవడానికి బీజేపీ చేసిన ఎత్తుగడ అది. ఐతే, బెంగాల్ లో ఘోర పరాభవం ఎదురైంది.

ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అదే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. తెలంగాణాలో బలపడడానికి ఇప్పుడు అదే ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ని అమిత్ షా కలిసిన వైనం చూశాం. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని నితిన్ కలవనున్నారు. త్వరలో మరికొందరు సెలెబ్రిటీలు కూడా బీజేపీ నేతలతో ‘ముచ్చటిస్తారు’. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఈవెంట్స్’కి తరుచుగా పిలుస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

తెలంగాణ బీజేపీలోనూ తారలున్నారు. విజయశాంతి, జీవిత, జయప్రద బీజేపీ నేతలే. త్వరలో జయసుధ కూడా చేరబోతున్నట్లు సమాచారం. అరిగిపోయిన ఈ ఫార్ములాని తెలంగాణ, టాలీవుడ్ లో అప్లై చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇది ఫలితాలను ఇస్తుందా అన్నది తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఆగాలి.

 

More

Related Stories