
సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం జోరు రెండు, మూడేళ్ళుగా తగ్గింది. ఇటీవల ‘జాతి రత్నాలు’ వంటి ఒకటి అరా సినిమాలో మాత్రమే కనిపించారాయన. దానికి దానికి రకరకాల కారణాలున్నాయి. ఐతే, ఇప్పుడు మళ్ళీ ఆయన కొంత బిజీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో అర డజన్ చిత్రాలున్నాయి.
అందులో ఒకటి ‘భీమ్లా నాయక్’ కావడం విశేషం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన ఎన్నో హిలేరియస్ పాత్రలు పోషించారు. ‘భీమ్లా నాయక్’ వంటి సీరియస్ సినిమాలో పాత్ర అంటే కొంత ఆశ్చర్యమే.
ఈ సినిమాతో పాటు ‘రంగమార్తాండ’, నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి సినిమాలు చేస్తున్నారు బ్రహ్మి.
అలాగని, మునుపటిలా ఎక్కువ సినిమాలు చెయ్యనను అని చెప్తున్నారు. “మనవడు పార్థతో ఆడుకోవడం, పెయింటింగ్ వెయ్యడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తోందిప్పుడు,”అంటున్నారు ఆయన. బాగా అలిసిపోయినట్లు ఆయన మాటల్లో ధ్వనిస్తోంది.