బన్నీ వాస్ తెగ ఫీలవుతున్నాడుగా!

Bunny Vaas


నిర్మాత బన్నీ వాసు ఏకంగా గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయికి లేఖ రాశారు. తన ఫేస్ బుక్ లో తెలుగులో లెటర్ పోస్ట్ చేశారు. ఇంతకీ బన్నీ వాసు బాధ ఏంటంటే… ఆ మధ్య ఓ యువతి ఆయన పేరుని బద్నామ్ చేసింది. పొలీసు కేసు పెట్టారు. ఆ యువతి మొన్న ఆయన ఆఫీస్ కి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించడం కూడా జరిగింది. ఆ యువతి చేసిన తీరు వల్ల, అలాగే సోషల్ మీడియాలో తనకి వ్యతిరేకంగా జరిగిన ట్రోలింగ్ వల్ల అయన మానసిక క్షోభకు గురయ్యారు. అందుకే, తన భావాలను పంచుకుంటూ ఆయన సుందర్ పిచ్చాయికి లేఖ రాశారు.

ఈయన లెటర్ ని పిచ్చాయి చదువుతారని కాదు కానీ… తన క్షోభ ఏంటో జనాలకి తెలియాలని పెట్టినట్లు కనిపిస్తోంది.

“గౌరవనీయులైన సుందర్ పిచ్చయ్ గారికి,

మీరు ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద ప్రచురించిన అభిప్రాయాన్ని నేను చదవటం జరిగింది. గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ అయిన మీరు ఎంతో ఆలోచనతో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు అని నా నమ్మకం. ఈ విషయం మీద నా స్వీయానుభవం ఒకటి మీతో పంచుకోవటం కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను.సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నేను కూడా నా ఆలోచనా విధానాలు, భావాలూ పంచుకోటానికి ఇది మంచి వేదిక అని నమ్మాను, అలానే భావ ప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని కచ్చితంగా అనుకున్నాను. ఈ నమ్మకంతోనే సామాజిక మాధ్యమాలను ఆనందంగా ఉపయోగించాను.

కానీ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వలన మానసికంగా నేను పడ్డ క్షోభను మీలాంటి వారికి చెప్పటం వలన సామజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద మీ ఆలోచన విధానంలో అభ్యుదయ మార్పు వస్తుందని నా నమ్మకం.

ఇదే కోవలో ఒక విచక్షణ లేని వ్యక్తి వలన ఇబ్బంది పడుతున్న నేను, నా కూతురు, దాని వల్ల నా కుటుంబానికి కలిగిన బాధ చూసిన వాడిగా ఈ ఉత్తరం రాస్తున్నాను. అబద్ధాలనూ అసత్యాలనూ పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడ్తున్న వాళ్ళది తప్పా ? అలాంటి వాళ్ళు చేస్తున్న క్రూరమైన పనులను నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా? అని అడిగితే సామాజిక మాధ్యమాల ద్వారా కేవలం ఒక వేదిక అందించటం మాత్రమే మేము చేస్తున్నది అని ఈ వేదికలు తపించుకోవచ్చు, కానీ ఈ విచ్చలవిడి స్వేచ్చకి బలైపోతున్న మాలాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చేది ఎవరు? న్యాయబద్దత, అవధులు, సరైన విచారణ లేని వార్తలు, పోస్టులు, కామెంట్లను అనుమతిస్తున్న ఇప్పటి సామజిక మాధ్యమాల వలన బలైన నేను, నా ఆరు సంవత్సరాల కూతురి ఆవేదనే ఈ ఉత్తరం.

ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇంటర్నెట్ చట్టాలు, సమాచారం అనే మనషి కి బట్టలు కడతాయి ఏమో చూడాలి. భావప్రకటనా స్వేచ్ఛ అనే పదును వైపు పెడుతున్న మీ శ్రద్ద అవతలి పదును వైపు కూడా పెడితే బాగుంటుంది. మేము పెడుతున్నాము అని అనుకోవచ్చు కానీ దాని సమర్థత వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది ?? ఈ ఉత్తరం చాలా మందికి వెటకారం కావచ్చు, కానీ తమ కుటుంబంలో స్త్రీలకో, పిల్లలకో ఇలాంటి పరిస్థితి వస్తే కానీ నా ఈ బాధ అర్థం కాదు. అలాంటి బాధను చూసిన వాళ్లకు ఈ ఉత్తరం అర్థం అవుతుంది, కానీ సోషల్ ప్లాట్ ఫారం అనే నడి వీధిలో నిలబడి వేదిక చూసిన వాళ్ళకి ఇది వినోదంలా కనిపిస్తుంది.”

Advertisement
 

More

Related Stories