
ఆగస్టు 1 నుంచి షూటింగులు బందు పెట్టాలనేది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం. ఈ గిల్డ్ లో సభ్యుడైన సీనియర్ నిర్మాత అశ్వనీ దత్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గురువారం ఉదయం చెప్పారు. ప్రభాస్ తో తాను నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్ ని ఆపేది లేదని చెప్తున్నారు. ఆయన నిర్మించిన ‘సీతారామం’ షూటింగ్ కి విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఇటీవల విడుదలైన ఏ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన లేదు. థియేటర్ల వద్ద ఓపెనింగ్ కనిపించడం లేదు. దాంతో, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది గిల్డ్. ఐతే, ఈ గిల్డ్ లోని కీలక సభ్యులే ఇప్పటి సమస్యకి కారణం అని అంటున్నారు దత్.
“జనం థియేటర్లకు రాకపోవడానికి కరోనా ఒక కారణం. టికెట్ రేట్లు ఒక పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఇంకో కారణం. అలాగే చాలా థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి,” అని తన అభిప్రాయాన్ని చెప్పారు దత్.
దత్ వెలిబుచ్చిన అభిప్రాయం కలకలం రేపింది. నిర్మాతల మధ్య సయోధ్య లేదనే అభిప్రాయం బలపడింది. సాయంత్రానికి ఆయన మాట మార్చారు.
నిర్మాతల నిర్ణయమే…. నా నిర్ణయం
”యాభై ఏళ్లుగా చిత్రసీమలో నిర్మాతగా కొనసాగుతున్నా. నా తోటి నిర్మాతలందరితోనూ చాలా సన్నిహితంగా, సోదర భావంగా మెలిగాను. ఏ నిర్మాతపైనా నాకు అగౌరవం లేదు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా… నిర్మాతలు, చిత్రసీమ శ్రేయస్సు కోసమే ఉద్భవించాయి. పరిశ్రమ కోసం అందరూ ఒక్క తాటిపై నడిచి… మంచి నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుందని నా అభిప్రాయం. నిర్మాతలంతా కలిసి… చిత్రసీమ గురించి ఏ మంచి నిర్ణయం తీసుకొన్నా నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.” అని సాయంత్రం ఒక ప్రకటన చేశారు సి. అశ్వనీదత్.