ఈసారి సమంత వల్ల అవుతుందా?

హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు ఇది గడ్డుకాలం. కరోనా తర్వాత సినిమా వ్యాపారం మారిపోయింది. హీరోలు లేకుండా హీరోయిన్ ప్రధాన పాత్రల్లో కనిపించే సినిమాలకు థియేటర్లలో కలెక్షన్లు గొప్పగా ఉండడం లేదు. సమంత హీరోయిన్ గా నటించిన ‘యశోద’ సినిమాకి కూడా సాదాసీదా ఓపెనింగ్ మాత్రమే వచ్చింది. కాకపొతే అది పాన్ ఇండియా చిత్రం కాదు కాబట్టి గట్టెక్కింది.

‘శాకుంతలం’ సినిమాకి మాత్రం అలాంటి ఓపెనింగ్ వసూళ్లు వస్తే కష్టం. భారీ ఖర్చుతో గుణశేఖర్ తీసిన ఈ సినిమా ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

పాన్ ఇండియా లెవల్లో ఆడుతుంది అనే ఆశతోనే, నమ్మకంతోనే భారీగా ఖర్చు పెట్టి తీశారు. ముఖ్యంగా ఓపెనింగ్ కూడా భారీగా రావాలి. సమంతకి ఇండియా అంతా క్రేజ్ ఉంది. ఐతే, ఆ క్రేజ్ ఓపెనింగ్స్ విషయంలో పనికి వస్తుందా అనేది చూడాలి. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ లో ఆమె ఓపెనింగ్స్ తెస్తుందా?

ఈ సినిమా విడుదలని ఇప్పటికే రెండు, మూడుసార్లు వాయిదా వేశారు. ఏప్రిల్ 14న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు. వేసవి సెలవులు ఇలాంటి పాన్ ఇండియా చిత్రాలకు సరైన సమయం. మరి సమంత స్టార్ డం ఈ సినిమాకి ఎంతవరకు పనికొస్తుందో. ఆమె ఈ సినిమాతో నిరూపించుకోగలిగితే ఆమె స్టార్డం మరింత పెరుగుతుంది.

Advertisement
 

More

Related Stories