తప్పు అని ప్రూవ్ చెయ్యండి: నాగవంశీ

Naga Vamsi

“గుంటూరు కారం” సినిమా గురించి పనిగట్టుకొని కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తయింది. మొదటి వారంలోనే 90 శాతం బయ్యర్లు సేఫ్ అయ్యారని చెప్పేందుకు ఆయన మీడియాతో ముచ్చటించారు.

“మొదటి రోజు ఉన్న టాక్ కి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లకు పొంతనే లేదు. సినిమా నిలబడుతుంది అని మా హీరో మహేష్ బాబు బలంగా నమ్మారు. అదే నిజమైంది. ఐతే, మీడియాలో కొంతమందికి మా మీద ఎక్కువ ప్రేమ (వ్యంగ్యంగా). వాళ్ళు ఈ సినిమా కలెక్షన్లు తప్పు అని చెప్తున్నారు. మేం చెప్పినవి తప్పు అని ప్రూవ్ చెయ్యమని చెప్పండి,” అని నాగవంశీ సవాల్ విసిరారు.

“రివ్యూలకి వాల్యూ లేదు. క్రిటిక్స్ ఏమైనా దేవుళ్ళా. ఆ కొందరు రాసిన రివ్యూల వల్ల సినిమాపై ఎలాంటి నెగెటివ్ ప్రభావం చూపలేదు. కాకపొతే, మేం చేసిన తప్పు విడుదలకు ముందు రోజు 1AM షోలు నిర్వహించడం. సలార్ సినిమా పక్కా మాస్ సినిమా. అది యాక్షన్ చిత్రం. వాళ్లకు అది వర్కవుట్ అయింది. ఇది కుటుంబకథా చిత్రం. ఫ్యామిలీ సినిమాకి మేం సలార్ సినిమాలా 1AM షోలు పెట్టడం కరెక్ట్ కాదు. అక్కడ తప్పు చేశాం,” అని నాగవంశీ అన్నారు.

“గుంటూరు కారం సినిమాని కొనుక్కున్న బయ్యర్ లు సేఫ్ అయ్యారు. ఎవరూ నష్టపోవడం లేదు. ఇది పక్కా మాస్ చిత్రం. పండగ సమయంలో ఫ్యామిలీస్ చూసే విధంగా తీసిన మాస్ మూవీ. దీన్ని అతడు, ఖలేజాతో పోల్చలేం,” అని వివరణ ఇచ్చారు.

Advertisement
 

More

Related Stories