భోళాశంకర్ మూవీ అప్ డేట్స్

ఆచార్య రిలీజ్ తర్వాత తన సినిమాలన్నింటికీ స్మాల్ గ్యాప్ ఇచ్చారు చిరంజీవి. ఆ గ్యాప్ లో లాంగ్ ఫారిన్ టూర్ పెట్టుకున్నారు. అలా విదేశీ పర్యటన ముగించుకొని ఇంటికొచ్చిన చిరు, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీస్ ను షెడ్యూల్ చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా భోళాశంకర్ కు కాల్షీట్లు కేటాయించారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది భోళాశంకర్ సినిమా. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా మరో షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి భోళాశంకర్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.

భోళాశంకర్ లో చిరంజీవి సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. సైరా తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించడం ఇది రెండో సారి. ఇక ఈ సినిమాలో కీలకమైన చిరు చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే 4 సాంగ్స్ ఫైనల్ చేశారు.

చిరంజీవి నటిస్తున్న మరో సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది. ఆ సినిమాకు కూడా త్వరలోనే కాల్షీట్లు కేటాయించబోతున్నారు మెగాస్టార్. వీటితో పాటు బాబి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు. అటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. 

 

More

Related Stories