
ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తున్నాడా? రాజేంద్రుడు గజేంద్రుడు, నంబర్ వన్, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, వినోదం, గన్ షాట్… ఇలా ఎన్నో హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు. కానీ అవి ఆడలేదు. ఆ టైమ్ లో ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేయాలని చిరంజీవి కూడా అనుకున్నారు. చిరంజీవితో ఓ సినిమా ప్రారంభమైనప్పటికీ అది ఆగిపోయింది.
అప్పట్లో ఆ సినిమా ఓపెనింగ్ కు నాగార్జున ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. మరో నెల రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందనగా ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పటికీ చిరంజీవి-కృష్ణారెడ్డి కలిసి సినిమా చేయలేదు. అప్పటి సంగతులను ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు.
“చిరంజీవితో ఆగిపోవడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. అడ్వాన్స్ టెక్నాలజీతో ముడిపడిన సినిమా అది. ఆ టైమ్ లో వర్కవుట్ అవుతుందా అవ్వదా అనే క్వశ్చన్ మార్క్ తో ఆగిపోయాం. పాతికేళ్ల కిందట అనుకున్న ఆ సినిమాను ఈ రోజుల్లో అయితే చేయడం ఈజీ,” అని అన్నారు.