
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సీనియర్ నటులు, దర్శకుల, నిర్మాతల ఇంటికి వెళ్లి వారితో కాసేపు సరదాగా ముచ్చటిస్తున్నారు. ఆ మధ్య మహాదర్శకుడు కే విశ్వనాథ్ పుట్టిన రోజు నాడు ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు కైకాల సత్యనారాయణ ఇంటికెళ్లారు.
చిరంజీవి, కైకాల కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఖైదీనంబర్ 786, .. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి వారి కాంబినేషన్లో. చిరంజీవి హీరోగా కైకాల నిర్మాతగా కొన్ని సినిమాలు సైతం వచ్చాయి.
ఈ రోజు (జూలై 25) కైకాల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు ఫిల్మ్ నగర్ లోని కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
“`తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతినిచ్చింది,” అని ఆ తర్వాత ట్వీట్ చేశారు.